ఉల్లిగడ్డను కోస్తేనే కాదు.. తలచుకుంటేనే కన్నీళ్లు వచ్చేలా ఉంది . ధరలు భారీగా పెరుగుతుండటంతో సామాన్యుడి కూరల్లో ఉల్లిపాయలు కనిపించని పరిస్థితి. నిన్న మొన్నటి దాక కేజీ ఉల్లిగడ్డ 40, 70 రూపాయల దగ్గర ఉండగా.. ఇప్పుడు ఏకంగా సెంచరీకి చేరువకావడం షాకింగ్ న్యూస్.
దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశమైతే.. ఉల్లి పండించే ప్రాంతాల్లో కూడా కేజీ 90 రూపాయలకు చేరువ కావడం కళ్లల్లో నీళ్లు వచ్చే అంశమే. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దేశ వ్యాప్తంగా ఆనియన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే నవంబర్ లో కొత్త పంట వచ్చే వరకు 90 రూపాయలకు కేజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మహారాష్ట్రలో ఉల్లిపాయలు బాగా పండిస్తారు. అలాంటిది ఛత్రపతి షంభాజీ నగర్ లో ఉల్లిగడ్డల ధరలు చుక్కలు చూపించడం ఆందోళనకరమైన విషయం. సిటీకి ఎక్కువగా సిల్లోడ్, అలంద్, ఫులంబ్రి, గనోరి.. మొదలైన ప్రాంతాల నుంచి వస్తుంటాయి. అయితే వర్షాభావం కారణంగా పంట సాగు తగ్గిందని.. సిటీకి ఉల్లిగడ్డలు చాలా మేరకు తగ్గిపోయాయని చెబుతున్నారు. ఉల్లి పండించే ప్రాంతంలోనే ఇలా ఉంటే ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటో అర్తం చేసుకోవచ్చు.
