ప్రభుత్వ భూమి ఏదో తేల్చకుండా ఎట్ల కూలుస్తరు? హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు

ప్రభుత్వ భూమి ఏదో తేల్చకుండా ఎట్ల కూలుస్తరు? హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు
  • మీరేమైనా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?
  • వాణి కోఆపరేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొసైటీ ప్లాట్ల కాంపౌండ్ల కూల్చివేతపై ఆగ్రహం
  • మల్కాజిగిరి పరిధిలో కూల్చివేతలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆదేశం

హైదరాబాద్‌‌‌‌‌‌, వెలుగు: హైడ్రా వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అంటూ నిలదీసింది. మేడ్చల్‌‌‌‌-మల్కాజిగిరి జిల్లాలోని సర్వే నంబర్లు 194/1, 211లో గల వాణి కోఆపరేటివ్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీలో అనుమతించిన ప్లాట్ల కాంపౌండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 

ఈ చర్య ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంటూ సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసును స్వీకరించింది. సంబంధిత అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కూల్చివేతలకు సంబంధించి కలెక్టర్‌‌‌‌, తహసీల్దార్లు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నప్పుడు హైడ్రా ఏ అధికారంతో కూల్చివేతలు చేపట్టిందని న్యాయస్థానం ప్రశ్నించింది. 

ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించకుండానే ఇష్టానుసారంగా కూల్చివేతలు చేపడతారా? అని నిలదీసింది. ఆధారాలు లేకుండా చేపట్టిన కూల్చివేతలకు వివరణ ఇచ్చేందుకు అధికారులు తరచూ కోర్టులకు రావాల్సి వస్తోందని.. దీంతో న్యాయస్థానం విలువైన సమయం వృథా అవుతోందని వ్యాఖ్యానించింది. 

మల్కాజిగిరి పరిధిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్‌‌‌‌ను ఆదేశించింది. ఎన్ని కూల్చివేతలు జరిగాయి? వాటికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి? కోర్టు ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా? తదితర వివరాలను నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేసింది. కూల్చివేతలపై హైడ్రాతోపాటు ఇతర అధికారులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.

కోర్టులో ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయో తెలుసుకోరా?

మల్కాజిగిరిలోని ప్లాట్ల కాంపౌండ్లను జులై 18న ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ పీచర లింగారావు మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌ వీ శ్రవణ్‌‌‌‌కుమార్‌‌‌‌ బుధవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది కాట్రం మురళీధర్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సర్వే నంబర్‌‌‌‌ 194లో 12 ఎకరాల పట్టా భూమి ఉందని, అందులో 4 ఎకరాలు పట్టణ భూ గరిష్ట పరిమితి కింద ప్రభుత్వానికి వచ్చాయని తెలిపారు. 

కూల్చివేతల సమయంలో సర్వేయర్లు, తహసీల్దార్లు అక్కడ ఉన్నట్టు రికార్డుల్లో పేర్లు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధికారులు స్పందిస్తూ కూల్చివేతల సమయంలో రెవెన్యూ అధికారులు ఎవరూ అక్కడ లేరని తెలిపారు. రికార్డుల్లో ఉన్న సంతకాలు కూడా ఈ సర్వే నంబరుకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు. 

కూల్చివేతలు చేపట్టాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కలెక్టర్‌‌‌‌ పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘జిల్లా పరిధిలో ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.. అవి ఏ దశలో ఉన్నాయి.. బాధ్యతలు చేపట్టిన వెంటనే వాటి గురించి తెలుసుకోరా.. కోర్టు ఉత్తర్వులు మీకు అందవా.. వాటి గురించి తెలియదా?’ అని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు చెప్పారని ప్రతిసారీ హైడ్రా చెబుతుండటంతోనే అధికారులను కోర్టుకు పిలిపించాల్సి వస్తోందన్నారు. 

అది ప్రభుత్వ భూమి అని హైడ్రా ఎలా నిర్ధారించింది?

అది ప్రభుత్వ భూమి అని హైడ్రా ఎలా నిర్ధారించిందని జడ్జి ప్రశ్నించారు. ప్రభుత్వ సర్వేయర్లు వెళ్లలేదంటే ప్రైవేటు సర్వేయర్‌‌‌‌ను పెట్టుకుని సర్వే చేయించారా? ఇది చట్టబద్ధత ఎలా అవుతుందని అడిగారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌పై కౌంటర్‌‌‌‌ ఎందుకు దాఖలు చేయలేదని మండిపడ్డారు. యూఎల్‌‌‌‌సీ కింద భూమిని స్వాధీనం చేసుకున్నా సంబంధితులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని.. అయితే, పిటిషనర్లకు అలాంటి నోటీసులు ఇచ్చినట్లు రికార్డుల్లో లేదన్నారు. 

2022లో కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ డీఆర్డీ ఆదేశాలు లేకుండా కూల్చివేతలు చేపట్టడం ప్రాథమికంగా కోర్టు ధిక్కరణేనని తేల్చారు. కూల్చివేతలను సమర్థించుకోవడానికి కనీసం ఒక్క ఆధారమైనా చూపించాలని హైడ్రాను ఆదేశించారు. మల్కాజిగిరి పరిధిలో 30 నుంచి 40 వరకు కూల్చివేతలు చేపట్టినట్టు హైడ్రా తరఫు న్యాయవాది చెప్పడంతో, వాటికి సంబంధించిన కోర్టు ఉత్తర్వులు, అనుమతుల వివరాలతో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌‌‌‌ను ఆదేశించి విచారణ వాయిదా వేశారు.