పైలట్‏ను గొడ్డలితో నరికి.. విమానాన్ని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించిండు: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై UAE ప్రకటన

పైలట్‏ను గొడ్డలితో నరికి.. విమానాన్ని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించిండు: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై UAE ప్రకటన

అబుదాబి: ఫ్లైదుబాయ్ విమాన ఘటన గురించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌ లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‎పై కాక్‌పిట్‌లో ఉండే క్రాష్ యాక్స్ (అత్యవసర గొడ్డలి)తో కో పైలట్ దాడి చేశాడని తెలిపింది. పైలట్‏పై దాడి చేసి విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకునేందుకు కో పైలట్ ప్రయత్నించాడని వెల్లడించింది. కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రాణాలను పణంగా పెట్టి పెను ప్రమాదాన్ని నివారించాడని కొనియాడింది. పైలట్‎పై దాడికి పాల్పడ్డ కో పైలట్‎ను ఒమన్‎కు చెందిన హమామ్ అల్-హమ్మామీగా గుర్తించినట్లు తెలిపింది. ఈ ఘటనను యూఏఈ ఉగ్రవాద చర్యగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

అసలేం జరిగిందంటే..?

బుధవారం (సెప్టెంబర్ 30) ఆకాశంలో సినీ రేంజ్లో హైడ్రామా నడిచింది. ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కాక్ పిట్లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. పైలట్ స్మిత్ మచ్చర్‏పై కో పైలట్ కత్తితో దాడి చేశాడు. పైలట్ల మధ్య ఘర్షణతో విమానం అదుపు తప్పింది.

విమానం ఆకాశంలో కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్ పిట్ నుంచి అరుపులు వినిపించడం, విమానం ఆకస్మాత్తుగా ఎత్తు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కొందరు పైలట్లు ధైర్యంగా కాక్‏పిట్ డోర్ బద్దలుకొట్టి పైలట్పై దాడి చేసిన కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల (ఆన్-డ్యూటీ సిబ్బంది) సహాయంతో విమానాన్ని ఈశాన్య సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సౌదీ పోలీసులు కో పైలట్ను అరెస్ట్ చేశారు. గాయపడ్డ పైలట్ను ఆసుపత్రికి తరలించారు. కో పైలట్ విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించినట్లు సౌదీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు యూఏఈ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లెదుబాయ్ విమాన ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించింది.