మిడ్-ఎయిర్ డ్రామాలో ప్రాణాలకు తెగించి 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యసాహసాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలోనూ ఆయన చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ సహా పలువురు ప్రముఖులు స్మిత్ మచ్చార్ అభినందించారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న 'ఫ్లై దుబాయ్' (Flight FZ1073) విమానంలో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో ఉన్న ఒమానీ కో-పైలట్ హఠాత్తుగా తీవ్రవాద ఉద్దేశంతో ప్రధాన పైలట్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. కేవలం రెండు నిమిషాల్లోనే విమానం వేగంగా కిందికి దూసుకెళ్తూ తీవ్ర ముప్పులోకి జారుకుంది
శరీరమంతా రక్తసిక్తమై, తీవ్ర గాయాలపాలైనప్పటికీ కెప్టెన్ స్మిత్ అస్సలు ధైర్యం కోల్పోలేదు. ఒకవైపు నా ప్రాణాల కోసం పోరాడుతూనే, మరోవైపు విమానం ప్రమాదంలో పడకుండా చూడటమే నా లక్ష్యంగా పెట్టుకున్నా అని ఆయన వెల్లడించారు. ఆ క్లిష్ట సమయంలో 'హనుమాన్ చాలీసా' పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నానని చెప్పడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అత్యంత కష్టం మీద కాక్‌పిట్ తలుపు తెరిచి, ప్రయాణికులు, క్రూ సిబ్బంది లోపలికి వచ్చి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేలా చేశారు. సౌదీ అరేబియాలోని తబుక్‌లో విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేయడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ "మరో 9/11 తరహా ప్రమాదాన్ని నివారించిన రియల్ హీరో" అని కొనియాడారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ .. తన ప్రాణాలకు ముప్పు ఎదురైనా ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని మచ్ఛర్ పై ప్రశంసలు కురిపించారు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా పఠిస్తూ.. మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలుసుకుని తనకు ఎంతో భావోద్వేగంగా అనిపించిందని తెలిపారు. ఆంజనేయస్వామి అనుగ్రహం ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలి. స్మిత్ ప్రదర్శించిన ధైర్యం ప్రతి భారతీయుడికీ గర్వకారణం అని అభినందించారు. ఆయన త్వరగా కోలుకుని ఆయురోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు.
మరో వైపు సల్మాన్ ఖాన్ కమాల్ కర్ దియా పైలట్ జీ. మీలాంటి వీరుడితో కలిసి విమానం ప్రయాణించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాఅని సలామ్ చేశారు. ప్రస్తుతం అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని కోట్లాది మంది ప్రార్థిస్తున్నారు.
