బేగంపేట నుంచి సచివాలయం వరకు.. మెట్రో, ఆర్టీసీ బస్సులో మంత్రుల ప్రయాణం

బేగంపేట నుంచి  సచివాలయం వరకు.. మెట్రో, ఆర్టీసీ బస్సులో మంత్రుల ప్రయాణం

హైదరాబాద్‌: నగర ప్రజా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ విధానాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించారు. మెట్రో రైలు, టీజీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికుల నుంచి కామన్‌ పాస్‌ అమలు తీరుపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

బేగంపేట మెట్రో స్టేషన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, అజారుద్దీన్‌, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్‌, నవీన్‌ యాదవ్‌, అధికారులు కామన్‌ పాస్‌తో మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడిన భట్టి.. మెట్రో నుంచి బస్సుకు మారే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, పాస్‌ వినియోగం, ప్రయాణ సౌకర్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కామన్‌ పాస్‌ వల్ల సమయం, శ్రమ ఆదా అవుతోందని పలువురు ప్రయాణికులు తెలిపారు. మెట్రో ప్రయాణం తర్వాత గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉండటం సౌకర్యంగా ఉందన్నారు. ప్రత్యేకంగా మరో టికెట్‌ తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం, ఏ బస్సు ఎక్కాలి అనే విషయంలో అయోమయం తగ్గడం వంటి ప్రయోజనాలను ప్రయాణికులు వివరించారు.

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి సెక్రటేరియట్‌ వరకు భట్టి విక్రమార్క సహచర మంత్రులతో కలిసి టీజీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులోనూ ప్రయాణికులతో మాట్లాడి కామన్‌ పాస్‌ వినియోగం, మెట్రో–బస్సు అనుసంధానం, ప్రయాణ సౌకర్యంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ప్రజా రవాణాలో ‘సీమ్‌లెస్‌’ ప్రయాణమే లక్ష్యం: భట్టి

మెట్రో–ఆర్టీసీ కామన్‌ పాస్‌ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ బస్సులను వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికుల ఇబ్బందులు, అయోమయం తగ్గుతాయని తెలిపారు.మెట్రో నుంచి దిగిన తర్వాత ఇల్లు, కార్యాలయం లేదా ఇతర గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండటం వల్ల ప్రయాణం మరింత సులభతరం అవుతుందని చెప్పారు. ప్రజా రవాణాలోని వివిధ మార్గాలను అనుసంధానం చేసి ప్రయాణికులకు ‘సీమ్‌లెస్‌’ ప్రయాణ అనుభూతిని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ప్రస్తుతం మెట్రో–ఆర్టీసీ సేవలను అనుసంధానం చేశామని, భవిష్యత్తులో ఆటోలు, ఊబర్‌ వంటి ఇతర రవాణా సేవలను కూడా అనుసంధానించే దిశగా ఆలోచిస్తున్నామని భట్టి తెలిపారు. కామన్‌ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా రవాణాను బలోపేతం చేస్తాం: పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ను తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఒకే పాస్‌తో ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకోవడం ద్వారా ప్రయాణికులకు సమయం, శ్రమతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని అన్నారు.నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు ప్రజా రవాణాను బలోపేతం చేయడం ముఖ్యమైన పరిష్కారమని పేర్కొన్నారు. ప్రజలను వ్యక్తిగత వాహనాల నుంచి ప్రజా రవాణా వైపు ఆకర్షించాలంటే ఆర్టీసీ, మెట్రో సేవలను సమన్వయంతో, సౌకర్యవంతంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు.

డైలీ పాస్‌, మంత్లీ పాస్‌తో పాటు కామన్‌ పాస్‌ను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని కామన్‌ పాస్‌ సేవలను మరింత మెరుగుపరుస్తామని పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.హైదరాబాద్‌ భవిష్యత్తు అభివృద్ధి, ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజల ప్రయాణ కష్టాల తగ్గింపులో ప్రజా రవాణా కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు.