Jr NTR: జాన్వీ AI వీడియోపై ఎన్టీఆర్ ఫైర్.. ‘వదిలిపెట్టను’ అంటూ వార్నింగ్!

Jr NTR: జాన్వీ AI వీడియోపై ఎన్టీఆర్ ఫైర్.. ‘వదిలిపెట్టను’ అంటూ వార్నింగ్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేస్తున్నారు. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కంటెంట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన జాన్వీ కపూర్ వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై జాన్వీ కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆమెకు మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఘాటుగా స్పందించారు.

జాన్వీ కపూర్ ఆగ్రహం..

తనకు సంబంధించిన AI జనరేటెడ్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ క్రియేట్ చేయొద్దని, షేర్ చేయొద్దని, ప్రోత్సహించొద్దని కోరారు. ఇది AI టెక్నాలజీని స్పష్టంగా దుర్వినియోగం చేయడమేనని పేర్కొంటూ.. దీనికి బాధ్యులైన వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

‘వదిలిపెట్టను’అంటూ ఎన్టీఆర్ ఫైర్..

జాన్వీ కపూర్ ట్వీట్‌పై జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే సంస్కృతి ఉన్న దేశంలో.. ఒక మహిళను అత్యంత నీచంగా చూపించేలా AIని ఉపయోగించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చుట్టమల్లే’ పాటను మార్ఫింగ్ చేసి వీడియో రూపొందించిన వారిని, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ తన ట్వీట్‌లో.. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ చూడొద్దని, షేర్ చేయొద్దని, ఎంగేజ్ కావొద్దని సూచించారు. ఈ రోజు మరొక మహిళపై ఇలాంటి దుర్వినియోగం జరిగితే.. రేపు అది మన తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తెకు కూడా జరగొచ్చని హెచ్చరించారు. AI దుర్వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని, మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ఆయన కోరారు.

వైరల్ అవుతున్న కంటెంట్ ఇదే.. 

AI టెక్నాలజీ దుర్వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సినీ నటి జాన్వీ కపూర్‌కు సంబంధించిన వీడియోను AI సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే తరహాలో ‘ఇందిరమ్మ రాజ్యం’ పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా అకౌంట్.. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కలిసి పాల్గొన్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలోని ఓ సన్నివేశాన్ని ఎడిట్ చేసి షేర్ చేసినట్లు తెలుస్తోంది.

ALSO READ : సమంత ఫేస్, వాయిస్‌తో ఆటలాడితే కుదరదు..

వరుసగా సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను AI సాయంతో మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఘటనలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సృజనాత్మకతకు, ఉపయోగకరమైన ప్రయోజనాలకు వినియోగించాల్సిన AI టెక్నాలజీ.. వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే ఆయుధంగా మారకూడదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి AI దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇటువంటి కంటెంట్‌ను రూపొందించే, షేర్ చేసే వ్యక్తులపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.