సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేయడం.. వారి గొంతును క్లోన్ చేసి ఫేక్ వీడియోలు తయారు చేయడం.. ఏకంగా వారి ముఖాలను ఉపయోగించి డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టించడం ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా కంటెంట్‌ను సృష్టించడం మరింత సులభమైంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు బాంబే హైకోర్టులో కీలక ఊరట లభించింది.
సమంత పేరు, ఫొటో, గొంతు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగించిన డీప్‌ఫేక్, మార్ఫింగ్, అభ్యంతరకర కంటెంట్‌పై బాంబే హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. జస్టిస్ మాధవ్ జమ్దార్ బెంచ్.. అలాంటి కంటెంట్‌ను తొలగించాలని సంబంధిత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది.
సమంత ఏం కోరిందంటే?
తన పేరు, ఫొటోలు, గొంతు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగించి డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ ఫొటోలు, AI వాయిస్ కంటెంట్, అభ్యంతరకర వీడియోలు, తనను పోలిన AI చాట్‌బాట్‌లు రూపొందిస్తున్నారని సమంత కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో టెక్నాలజీ సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, AI డెవలపర్లు, డిజిటల్ మీడియా, ఈ-కామర్స్ సంస్థలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే, గుర్తుతెలియని వ్యక్తుల అక్రమ చర్యలను అడ్డుకునేందుకు ‘John Doe’ ఆర్డర్‌ను కూడా కోరారు.
‘పర్సనాలిటీ రైట్స్’కు రక్షణ
ఈ కేసులో సమంత వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రాజ్యాంగ పరిరక్షణ ఉందని బాంబే హైకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 19(1)(a), ఆర్టికల్ 21తో పాటు కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 38B కింద నటిగా ఆమె నైతిక హక్కులకు కూడా రక్షణ ఉందని స్పష్టం చేసింది. డీప్‌ఫేక్, మార్ఫింగ్ కంటెంట్ వల్ల ఈ హక్కులు ప్రభావితమైనట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని కోర్టు పేర్కొంది.
గూగుల్, మెటా సహా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు
గూగుల్, మెటా వంటి ప్లాట్‌ఫామ్‌లలో సమంతను పోలిన AI కంటెంట్, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఆమె పేరు, ఫొటో, గొంతును అనుమతి లేకుండా ఉపయోగించే కంటెంట్‌పై కూడా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే, యూజర్ల హక్కుల పరిరక్షణకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇది కేవలం సమంత కేసు మాత్రమే కాదు..
ఇది సమంతకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. AI డీప్‌ఫేక్‌ల ద్వారా సెలబ్రిటీల ముఖం, గొంతు, పేర్లను దుర్వినియోగం చేసే ఘటనలు పెరుగుతున్న వేళ.. బాంబే హైకోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి. అయితే ఇది తుది తీర్పు కాదు.. సమంతకు ప్రస్తుతం మధ్యంతర రక్షణ మాత్రమే లభించింది. తదుపరి విచారణ డిసెంబర్ 10న జరగనుంది. ఇకపోతే, ప్రస్తుతం సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రెగ్నెన్సీ లైఫ్ లీడ్ చేస్తుంది.
