పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసిన నయారా ఎనర్జీ.. లీటరుపై ఎంతెంతంటే?

పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసిన నయారా ఎనర్జీ.. లీటరుపై ఎంతెంతంటే?

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లపై ప్రైవేట్ రంగ దిగ్గజం 'నయారా ఎనర్జీ' కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న వేళ ఆ భారాన్ని సర్దుబాటు చేసేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్‌గా ఉన్న నయారా.. పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.5, డీజిల్ రేటును లీటర్‌కు రూ.3 చొప్పున తక్షణమే పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ తాజా పెంపు శనివారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 7వేల 108 పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ, అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు, రిఫైండ్ ఉత్పత్తుల వ్యయాలకు అనుగుణంగా ఈ ధరల సవరణ చేపట్టింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు మార్కెట్లో ఏర్పడిన ఇబ్బందుల వల్ల రిటైలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గతంలో మార్చి నెలలో కూడా ఇరాన్ వివాదం కారణంగా క్రూడ్ సరఫరా దెబ్బతిన్నప్పుడు.. రేట్లు పెంచిన మొదటి రిటైలర్‌గా నయారా నిలిచింది. ఆ తర్వాత జూలైలో అంతర్జాతీయ మార్కెట్ కుదుటపడటంతో ఆ పెంపును వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ రిటైలర్లయిన ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలు మాత్రం 90 శాతానికి పైగా బంకులను కలిగి ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ ధరలు మారుతున్నప్పటికీ రిటైల్ ధరలను చాలా కాలంగా స్థిరంగానే ఉంచుతూ వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ధరలు పెంచకపోవడం వల్ల రిటైలర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవల వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో పెట్రోల్‌పై సుమారు రూ. 8, డీజిల్‌పై రూ. 9 చొప్పున ప్రతి లీటర్‌పై నష్టం వస్తోందని, దీనివల్ల ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టాలు వస్తున్నాయని ఇక్రా అంచనా వేసింది.

రిటైల్ విక్రయాలపై నష్టాలు వస్తున్నాయనే కారణంతో నయారా, జియో-బీపీ సంస్థలు కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలను ఇప్పటికే పరిమితం చేశాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం, ప్రైవేట్ రిటైలర్లు ఇంధన విక్రయాలను నిలిపివేయరాదని, కోటాలను తగ్గించరాదని స్పష్టం చేసింది. ఇండస్ట్రియల్ వినియోగదారులు తక్కువ ధరకు రిటైల్ బంకుల నుంచి డీజిల్ కొనుగోలు చేయడం వల్ల సరఫరాపై తీవ్ర ఒత్తిడి పడుతోందని అధికారులు తెలిపారు. అంబానీకి చెందిన రిలయన్స్ జియో-బీపీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రేట్ల పెంపును ప్రకటించలేదు. 

ALSO READ : జియో మైండ్ బ్లాకింగ్ ఆఫర్

నయారా తీసుకున్న ఈ తాజా ధరల పెంపు నిర్ణయం సమీప భవిష్యత్తులో ప్రైవేట్, ప్రభుత్వ బంకుల మధ్య ధరల వ్యత్యాసాన్ని పెంచనుంది. ఈ ధరల పెంపును దీర్ఘకాలికంగా కొనసాగిస్తే రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ సంస్థలు కూడా రానున్న రోజుల్లో ప్రైవేటు ఆయిల్ కంపెనీల దారిలోనే రేట్లను పెంచుతాయా అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే వేచి చూడాల్సిందే.