- ప్రాజెక్టు పంపులు నడిపినా ఫాయిదా లేదు!
- మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కులకుపైగా వరద
- రోజుకు 1.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయొచ్చు..
- ఎన్డీఎస్ఏ ఆదేశాలతో అన్నారం, సుందిళ్ల గేట్లు ఖుల్లా
- వాటిని మూస్తేనే ఎల్లంపల్లి నీళ్ల లిఫ్టింగ్
- లీకేజీలతో గేట్లు తెరిచే ఉంచాల్సిన పరిస్థితి దీంతో ప్రాణహిత నీళ్లు వృథాగా దిగువకు..
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్‌కు ప్రాణహిత నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నది.. కనుచూపుమేర ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి.. ‘ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఈ నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసి, అక్కడి నుంచి పంట పొలాలకు ఇవ్వవచ్చు కదా?’ అనే అనుమానం సహజమే. దీనిపై ‘వెలుగు ప్రతినిధి’ కాళేశ్వరం బ్యారేజీలు, పంపు హౌస్ లను సందర్శించి, అక్కడి ఇంజినీర్లతో చర్చించారు. గోదావరిపై ఎల్లంపల్లి దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ వరుసగా ఉంటాయి. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, దాని ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి సీపేజ్‌లు(లీకేజీలు) ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. దీంతో ఈ మూడు బ్యారేజీలకు రిపేర్లు పూర్తిచేసేదాకా నీటిని నిల్వ చేయవద్దని, అప్పటిదాకా వాటిని కాపాడుకునేందుకు గేట్లను ఖుల్లా పెట్టి, వచ్చిన నీళ్లను వచ్చినట్లే కిందికి వదిలేయాలని నేషనల్డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఆదేశించింది. ఆమేరకు ఇరిగేషన్ ఆఫీసర్లు మూడు బ్యారేజీల గేట్లు పూర్తిగా ఎత్తిపెట్టారు. ప్రస్తుతం గోదావరిలో చుక్క వరద లేదు. కేవలం చివరిదైన మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత నది నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నది ఆ నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేక కిందికి వదిలేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.
మేడిగడ్డ వద్ద వరద.. సుందిళ్ల, అన్నారం లో ఇసుక..
కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఈ రెండు బ్యారేజీల్లో కనుచూపు మేర ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. ఎన్డీఎస్ఏ ఆదేశాలతో బ్యారేజీల గేట్లన్నింటినీ తెరిచి ఉంచారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర మాత్రం గోదావరిలో ప్రాణహిత నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. అన్ని గేట్లను తెరిచి ఉంచడంతో వచ్చిననీళ్లు వచ్చినట్టే కిందికి పోతున్నాయి.
లక్ష క్యూసెక్కులకుపైగా ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదవుతున్నది. మూడు, నాలుగు రోజులుగా రోజుకు లక్ష క్యుసెక్కులకు పైగా ఇన్ ఫ్లో ఉన్నట్టు ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు. నాలుగు నెలల్లో దాదాపు 500 టీఎంసీల నీరు దిగువకు వెళ్లిపోయినట్టు వివరించారు. జూలై 31న అత్యధికంగా 10 లక్షల 62 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో నమోదైనట్లు ఇంజినీర్లు తెలిపారు. జూలై చివరి వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు రోజుకు సగటున రెండు లక్షల నుంచి ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో నమోదయింది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేనప్పుడు కూడా 10 వేల నుంచి 25 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని చెప్పారు.
మేడిగడ్డ లో పంప్హౌస్దాకా నీళ్లు..
మేడిగడ్డ బ్యారేజీ కి 18 కిలోమీటర్ల ఎగువన ఉండే కన్నేపల్లి పంపు హౌస్ నుంచి రోజుకు 3 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసేలా 17 మోటర్లు రెడీగా ఉన్నాయి. 2023 అక్టోబర్ లో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత ఈ పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయలేదు. ఆస్ట్రియా దేశానికి చెందిన కంపెనీ మోటార్లు పాడవకుండా నెలలో ఒకసారి ప్రతి మోటార్ ను ఆరు నిమిషాల పాటు రన్నింగ్ చేస్తున్నట్టు ఇరిగేషన్ ఇంజనీర్లు తెలిపారు. ఇక్కడ ప్రాణహిత కలుస్తుండడంతో ప్రస్తుతం గోదావరి 97.5 మీటర్ల ఎత్తుతో ప్రవహిస్తున్నది. లక్షకుపైగా క్యూసెక్కుల వరద ఉండడంతో పంపు హౌస్ హెడ్ రెగ్యులేటర్ దాకా నీళ్లు కనిపిస్తున్నాయి. అంటే హెడ్ రెగ్యులేటర్ కు అమర్చిన11 గేట్లు తెరిస్తే ఈ వరద ఫోర్ బే ద్వారా పంపు హౌస్ లోకి వెళ్తుంది. అక్కడ 8 మోటార్ల సహాయంతో రోజుకు 1.5 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. గోదావరిలో 10 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒక మోటార్ నడిపించవచ్చు. పెరిగే వరదను బట్టి మోటార్ల సంఖ్యను పెంచుకుంటూ నీటిని లిఫ్ట్ చేయవచ్చు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు వేయకుండానే వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నదని, కానీ ఎత్తిపోసిన నీళ్లన్నీ కెనాల్‌ద్వారా అన్నారం బ్యారేజీలోకే వెళ్తాయని, అక్కడ గేట్లు తెరిచి ఉంచడం వల్ల మళ్లీ మేడిగడ్డ బ్యారేజీలోకే వస్తాయని ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తున్నారు.
మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్మండలంలోని మేడిగడ్డ గ్రామం వద్ద ఉంది. ఈ బ్యారేజీ కెపాసిటీ 16 టీఎంసీలు. దీని పంప్‌హౌస్ అంటే కన్నెపల్లి పంప్‌హౌస్.. బ్యారేజీ ఎగువన ఏకంగా 17.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్యారేజీలోకి 10వేల క్యూసెక్కుల వరద ఉన్నా కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చేలా డిజైన్‌చేశారు. అలా వచ్చిన నీటిని పంప్‌హౌస్ నుంచి 28.4 కిలోమీటర్ల దూరంలోని అన్నారం బ్యారేజీలో ఎత్తిపోసుకోవచ్చు. లక్ష్మీ బ్యారేజీ గేట్లు తెరిచిపెట్టినా లిఫ్టింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు.
అన్నారం (సరస్వతి) బ్యారేజీ సైతం భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం లోని అన్నారం గ్రామానికి దగ్గర్లో ఉంటుంది. ఈ బ్యారేజీ కెపాసిటీ 10.87 టీఎంసీలు. బ్యారేజీ ఎగువన సుమారు 28.2కిలోమీటర్ల దూరంలోని సిరిపురం గ్రామం వద్ద అన్నారం పంపు హౌస్ ఉంటుంది. మేడిగడ్డ మాదిరి తక్కువ నీటి ప్రవాహం ఉన్నప్పటికీ పంప్‌హౌస్‌కు నీరు చేరే పరిస్థితి ఇక్కడ లేదు. అన్నారం బ్యారేజీలో సుమారు 80 శాతం నీళ్లు నిల్వ చేస్తే తప్ప సిరిపురం పంప్‌హౌస్‌కు చుక్కనీరు చేరదు. బ్యారేజీ గేట్లు ఖుల్లా పెట్టాల్సి రావడం వల్ల ఈ పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి ఎగువన 3.2 కిలోమీటర్ల దూరంలోని సుందిళ్ల బ్యారేజీకి నీళ్లు ఎత్తిపోసే అవకాశమే లేదు.
సుందిళ్ల(పార్వతి) బ్యారేజీని పెద్దపల్లి జిల్లా మంథని మండలం లోని కాశి పేట దగ్గర నిర్మించారు. దీని కెపాసిటీ 8.83 టీఎంసీలు. దీని పంపుహౌస్.. బ్యారేజీ ఎగువన 24.2 కిలోమీటర్ల దూరంలోని రామగిరి మండలం గోలివాడ దగ్గర ఉంటుంది. సుందిళ్ల బ్యారేజీ వద్ద 70 శాతానికి పైగా నీళ్లను నిల్వ చేస్తేనే గోలివాడ పంపుహౌస్దాకా నీళ్లు చేరుకుంటాయి. ఈ బ్యారేజీ గేట్లను సైతం ఖుల్లా పెట్టాల్సి రావడం వల్ల గోలివాడ పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి ఎగువన 6.1 కిలోమీటర్ల దూరంలోని ఎల్లంపల్లి బ్యారేజీలోకి నీళ్లు ఎత్తిపోసే వీలులేకుండా పోతున్నది.
అన్నారం, సుందిళ్ల గేట్లు మూస్తే తప్ప..
ముందే చెప్పినట్లు మేడిగడ్డ బ్యారేజీ గేట్లతో సంబంధం లేకుండా కన్నేపల్లి పంపు హౌస్ నుంచి నీటిని ఎగువకు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. కానీ మేడిగడ్డ నుంచి అన్నారంలోకి, అన్నారం నుంచి సుందిళ్లకు, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి కి వాటర్ పంపింగ్ చేయాలంటే మధ్యలోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూయాల్సిందే. కానీ మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజ్‌లు రావడంతో ఈ మూడింటిని కాపాడుకునేందుకు అన్ని గేట్లు తెరిచే ఉంచాలని ఎన్డీఎస్ ఏ చెప్పడంతో అధికారులు ఖుల్లా పెట్టారు. ఫలితంగా నీటిని ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది.
