పోచంపల్లి ఇక్కత్‌కు క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే నేతన్న పేరు, ఊరు, తయారీ వివరాలు

పోచంపల్లి ఇక్కత్‌కు క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే నేతన్న పేరు, ఊరు, తయారీ వివరాలు
  • స్కాన్ చేయగానే నేతన్న పేరు, 
  • ఊరు, తయారీ వివరాలు
  • నకిలీలకు చెక్ పెట్టేలా 
  • సర్టిఫికెట్ ఆఫ్ అథెంటికేషన్ 

హైదరాబాద్, వెలుగు: భూదాన్ పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు ప్రభుత్వం క్యూఆర్  కోడ్ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలుదారులు ఆ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌ను స్కాన్ చేయగానే ఆ వస్త్రం ఎక్కడ తయారైంది.. ఎలా తయారు చేశారు. నేతన్న పేరు వంటి సమగ్ర సమాచారం తెలిసిపోతుంది. ఇప్పటికే భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) ఉన్నప్పటికీ, మార్కెట్లో నకిలీల బెడద ఎక్కువ కావడంతో అధికారులు డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టారు. గత నెల క్యూఆర్​ కోడ్​ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జూపిటెక్స్ ఏఐ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ డిజిటల్ టెక్నాలజీని ఇప్పటికే ఎంపిక చేసిన కొంతమంది నేత కార్మికుల ఉత్పత్తులకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రతి పోచంపల్లి చేనేత వస్త్రానికి ప్రత్యేక క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌ను అనుసంధానించారు. కాగా, చేనేత కుటుంబాల సాధికారత, జీవనోపాధి పెంపుదలే లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థ ‘యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్’తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా క్షేత్రస్థాయిలోని చేనేత కార్మికులకు ఆధునిక డిజైన్లలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌తోపాటు సామాజిక అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందించనున్నారు. సాంకేతికత, పర్యాటకం, నైపుణ్య శిక్షణల కలయికతో పోచంపల్లి ఇక్కత్ కళకు పూర్వవైభవం తీసుకొస్తున్నారు. 

మార్కెట్లో నకిలీలకు అడ్డుకట్ట

భూదాన్ పోచంపల్లి ఇక్కత్‌‌‌‌‌‌‌‌కు దేశ, విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని సూరత్, అహ్మదాబాద్, రాజ్‌‌‌‌‌‌‌‌కోట్ వంటి ప్రాంతాల్లోని మిల్లుల్లో పోచంపల్లి డిజైన్లను కాపీ చేస్తున్నారు. చేనేత మగ్గంపై వేల రూపాయలు వెచ్చించి, ఎంతో శ్రమతో నేసే రూ.10 వేల విలువైన పట్టుచీర డిజైన్లను, పవర్‌‌‌‌‌‌‌‌లూమ్‌‌‌‌‌‌‌‌లు, ప్రింటింగ్ మెషిన్లపై కేవలం రూ.250 నుంచి రూ.500కే తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు నకిలీ వస్త్రాలు లభిస్తుండటంతో అసలైన చేనేత వస్త్రాల అమ్మకాలు పడిపోయి, పోచంపల్లి నేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ ప్రత్యేక చొరవ తీసుకుని క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలిదశలో భాగంగా భూదాన్ పోచంపల్లి, గుండాల ప్రాంతాల్లో చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యూఆర్ కోడ్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. తర్వాత జిల్లాలోని అన్ని ప్రాథమిక చేనేత సహకార సంఘాలతో పాటు మాస్టర్ వీవర్స్, ఉత్పత్తిదారులు, టై అండ్ డై అసోసియేషన్ సభ్యులు, రిటైల్ క్లాత్ షోరూంలను కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేయనున్నారు. షోరూమ్​లలో విక్రయించే ప్రతి చీరకు క్యూఆర్ కోడ్ ఉండేలా విస్తృత స్థాయిలో అమలు చేయనున్నారు. 

స్కాన్ చేస్తే  నేతన్న ఫొటో, వివరాలు

పోచంపల్లిలో తయారయ్యే ప్రతి చేనేత వస్త్రానికి అనుసంధానించే ఈ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌ను స్కాన్ చేయగానే ప్రత్యేక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఆ ఉత్పత్తికి సంబంధించిన సర్టిఫికెట్ ఆఫ్ అథెంటికేషన్ తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లో కనిపిస్తుంది. అంతేకాకుండా, చేనేత-జౌళి శాఖ వద్ద నమోదైన మగ్గం జియో-ట్యాగ్ నంబర్, ఆ వస్త్రాన్ని నేసిన చేనేత కార్మికుడి ఫొటో, వారి గ్రామం, మండలం వంటి పూర్తి ప్రొఫైల్ కొనుగోలుదారులకు తెలుస్తుంది. దీనివల్ల వినియోగదారుల్లో నమ్మకం పెరగడంతోపాటు క్షేత్రస్థాయి నేతన్నలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది.

అంతేకాకుండా.. పోచంపల్లి చేనేత వైభవాన్ని, సంస్కృతిని పర్యాటకులకు ప్రత్యక్షంగా పరిచయం చేసేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. క్రియేటివ్ ఎకానమీ ఇంపాక్ట్ కలెక్టివ్ (సీఈఐసీ) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన  ప్రత్యేక టూరిజం ట్రయిల్స్ ద్వారా పోచంపల్లి చేనేత కళా చరిత్ర, ఇక్కడి స్థానిక ఆహార సంప్రదాయాలు, నేతన్నల జీవనశైలిని సందర్శకులకు తెలియజేయనున్నారు. పర్యాటకులు నేరుగా మగ్గాల వద్దకే వెళ్లి నేత విధానాన్ని పరిశీలించే సరికొత్త అనుభవాన్ని ఈ ప్రాజెక్ట్ కల్పించనుంది.