ఏషియన్ గేమ్స్ 2026..షూట్‌ఆఫ్‌లో అదరగొట్టిన కుంకుమ్.. భారత్‌కు చారిత్రాత్మక ఆర్చరీ గోల్డ్!

ఏషియన్ గేమ్స్ 2026..షూట్‌ఆఫ్‌లో అదరగొట్టిన కుంకుమ్.. భారత్‌కు చారిత్రాత్మక ఆర్చరీ గోల్డ్!

2026 ఆసియా క్రీడలలో మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఫైనల్లో, 17 ఏళ్ల భారత సంచలనం కుంకుమ్ మొహుద్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. శనివారం (అక్టోబర్ 3, 2026) జరిగిన మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన ఓ యేజిన్‌ను ఓడించి భారతీయ రికర్వ్ ఆర్చర్ కుంకుమ్ మోహోద్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.దక్షిణ కొరియాకు చెందిన ప్రత్యర్థి ఓ యేజిన్ తో హోరాహోరీగా సాగిన ఈ పోరులో, ఇద్దరూ 5-5 పాయింట్లతో టైగా నిలిచారు. ఆ తర్వాత జరిగిన ఉత్కంఠభరితమైన షూట్  ఆఫ్‌లో ఓ యేజిన్ 8 పాయింట్లు సాధించగా, కుంకుమ్ ఒత్తిడిని అధిగమించి ఖచ్చితమైన 10 పాయింట్లు సాధించి 6-5 తేడాతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఆసియా క్రీడల చరిత్రలో మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా కుంకుమ్ మోహోద్ చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయంతో భారతదేశానికి 2028 లాస్ ఏంజిల్స్ (LA 28) ఒలింపిక్స్ కోటాను కూడా ఆమె ఖరారు చేసుకుంది.  

ఈ 2026 ఆసియా క్రీడలలో కుంకుమ్‌కు ఇది రెండవ స్వర్ణ పతకం. అంతకుముందు రోజు జరిగిన మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో అంకితా భకత్, కీర్తి శర్మలతో కలిసి ఆమె టీమ్ గోల్డ్ మెడల్ కూడా గెలుచుకుంది.