హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన ఎనిమిది రోజుల తర్వాత హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన ఇనుప రాడ్లు, పైపుల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచి కార్మికులు ఇనుప నిర్మాణాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.
69 అడుగుల ఎత్తు, సుమారు 40 టన్నుల బరువుతో రూపొందించిన బడా గణేష్ విగ్రహ నిర్మాణంలో 20 టన్నులకు పైగా ఇనుమును వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. నిమజ్జనం అనంతరం సాగర్‌లో మిగిలిన ఇనుప రాడ్లు, పైపులను వెల్డింగ్ చేసిన కార్మికులే ప్రస్తుతం తొలగిస్తున్నారు.ఇనుప నిర్మాణం తొలగింపు కోసం సుమారు 20 మంది కార్మికులను రంగంలోకి దించారు. ప్రతి ఏడాది బడా గణేష్ నిర్మాణానికి, అనంతరం ఇనుప నిర్మాణం తొలగించేందుకు మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా కార్మికులు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భారీ ఇనుప నిర్మాణాన్ని విడదీసి ఒక్కొక్క భాగాన్ని బయటకు తీస్తున్నారు. పనులు ఈరోజు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇనుము తొలగింపు పనులతో పాటు హుస్సేన్ సాగర్ పరిసరాలను శుభ్రం చేసే పనులు కూడా కొనసాగుతున్నాయి. నిమజ్జనం తర్వాత మిగిలిన వ్యర్థాలు, ఇతర సామగ్రిని సిబ్బంది తొలగిస్తున్నారు. సాగర్ పరిసరాలను వీలైనంత త్వరగా శుభ్రం చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
బడా గణేష్ విగ్రహ నిమజ్జనం పూర్తయినప్పటికీ, భారీ ఇనుప నిర్మాణాన్ని పూర్తిగా తొలగించేందుకు మరికొంత సమయం పడుతోంది. ఇనుము తొలగింపు పూర్తయిన తర్వాత సాగర్ పరిసరాల్లో శుభ్రపరిచే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.
