ఇండియా రెజ్లర్ సుజిత్ కల్కల్.. ఏషియాడ్‌లో స్వర్ణ పట్టు చూపెట్టాడు. మెన్స్ 65 కేజీల ఫైనల్లో 10–9తో అబ్దుల్మజిద్ కుదియేవ్ (తజకిస్తాన్)పై గెలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇరాన్, జపాన్ రెజ్లర్లను సునాయసంగా ఓడించి ఫైనల్ చేరిన సుజిత్‌కు ఫైనల్లో కుదియేవ్ చుక్కలు చూపెట్టాడు. ఉడుంపట్టుతో ఇండియన్ రెజ్లర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
కానీ పట్టునుంచి తేరుకున్న సుజిత్ తర్వాతి రౌండ్లలో అద్భుతమైన వేగం, టెక్నికల్ స్కిల్‌తో వరుసగా పాయింట్లు సాధించాడు. ఫలితంగా 10–9తో బౌట్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీస్‌లో జపాన్ ఒలింపిక్ చాంపియన్ కొటారో కియోకాను ఓడించిన సుజిత్.. ఆరంభంలో అఫ్గానిస్తాన్, ఇరాన్ ప్రత్యర్థులపై పట్టు సాధించాడు. గత 12 నెలల్లో అండర్–23 వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్‌తో పాటు పలు ప్రధాన టోర్నీల్లో విజయం సాధించాడు.
విమెన్స్ 50 కేజీల్లో యువ రెజ్లర్ దీపాన్షి ఫోగట్ నిరాశపర్చింది. కాంస్య పతక పోరులో దీపాన్షి.. జెనిప్ బయనోవా (కజకిస్తాన్) చేతిలో ఓడింది. పిన్ డౌన్‌కు గురి కావడంతో ఓటమి తప్పలేదు.
