బషీర్‌బాగ్, వెలుగు : ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, సామాజిక చైతన్యాన్ని రగిలిస్తున్న మంజీరా రచయితల సంఘం (మరసం) భావితరాలకు దిక్సూచిగా నిలుస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన మరసం 40వ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. కవులంటే మాట, పాట, ఆటకు ప్రాణం పోసే వారన్నారు.
ఒక సాహిత్య సంస్థను నడపడం కత్తిమీద సాములాంటిదని, నిర్బంధాలు, బెదిరింపులు, రాజ్యహింసను ఎదుర్కొంటూ మరసం ముందుకు సాగిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులను ఏకం చేసి ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఘనత మరసంకే దక్కుతుందన్నారు. నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, దేవీప్రసాద్, విరాహత్ అలీ వంటి వారి కృషి తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదిరాయిగా నిలిచిందన్నారు.
సాహిత్యంలో ఏఐ ప్రభావం పెరిగినా.. హృదయంతో, మట్టి వాసనలతో రాసే కవిత్వం, సాహిత్యానికే జీవం ఉంటుందన్నారు. ఇతర దేశాల్లో ప్రజలు పుస్తక పఠనం వైపు మళ్లుతుంటే, మన దేశంలో చిన్నారులు సైతం సెల్‌ఫోన్లకు అలవాటుపడడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
పుస్తక పఠనాన్ని పెంపొందించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మరసం వ్యవస్థాపకుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, టీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడారు.
వారం రోజుల పాటు సిద్దిపేట జిల్లా పదేండ్ల పండుగ
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా ఏర్పడి ఈ నెల 11తో పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా వారం రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఈ వేడుకల నిర్వహణపై ఈ నెల 4న సిద్దిపేటలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వారం రోజుల పాటు వేడుకలు, అక్టోబర్ 11 సభ నిర్వహించనున్నట్లు ప్రకటింటారు.
