వెలుగు స్పెషల్: హలో..! ఆ గొంతులు వినబడుతున్నాయా?

వెలుగు స్పెషల్: హలో..! ఆ గొంతులు వినబడుతున్నాయా?

రాజకీయ పార్టీలు తమ నడక మార్చుకోవాలి.  నడుస్తున్న చరిత్రను అర్థం చేసుకొని మన రాజకీయ నాయకులు కూడా వాస్తవికంగా ఉండటానికి యత్నించాలి. చెట్టు పేరు చెప్పుకొని పాడైన కాయలమ్ముకునే చందంగా ప్రజాస్వామ్యం పేరిట జరిగే ప్రజావంచనను అనుమతించకూడదు. సదరు వంచనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తామే కారణమో, తామూ భాగస్వాములో కాకూడదు. 

అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడటం, ఒకసారి అధికారం చేజిక్కితే  ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా ఇష్టానుసారం వ్యవహరించడం పాలకులకు ఇటీవల పరిపాటి అయింది. దీర్ఘకాలంపాటు అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి తొక్కుతున్న అడ్డదారులకు లెక్కేలేదు. ఈ క్రమంలో  రాజ్యాంగ పరిధిలోని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ బలహీనపరుస్తున్నారు!  స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలను నిర్వీర్యపరచి శిథిలం చేస్తున్నారు. ఫలితంగా ప్రజలు నలిగిపోతున్నారు.  సమాజంలో అశాంతి ప్రబలుతోంది. అందుకు వ్యతిరేకంగా పౌర సమాజం సంఘటితమయ్యే సంకేతాలు వెలువడుతున్నాయి.  తూర్పు వాకిట వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. ఎవరు కళ్లు మూసుకున్నా సూర్యోదయం ఆగదు.

ప్రభుత్వాల పనితీరు మంచీ చెడులు ప్రజాక్షేత్రంలో తరచూ చర్చకు వస్తున్నాయి.  పాలనా వ్యవస్థలు ఒకటొకటి భ్రష్టుపట్టి పోవడాన్ని ప్రజలు, ముఖ్యంగా ఆలోచనాపరులు చూస్తూ సహించలేకపోతున్నారు. సుప్రీంకోర్టు అనుచిత వ్యాఖ్యలు, అంతకుముందు ‘నీట్‌‌‌‌’ పేపర్ లీక్‌‌‌‌తో  పుట్టుకు వచ్చిన ‘జంతర్ మంతర్‌‌‌‌’ యువజనోద్యమం మనం చూశాం. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసి, ఒత్తిడి పెంచి కేంద్రం మెడలు వంచి మంత్రి చేత రాజీనామా చేయించడం ప్రజా ఉద్యమ ఫలితమే.  దేశంలో ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతను తాకట్టు పెట్టారనే కోపంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా బలపడుతున్న  దేశవ్యాప్త నిరసనలు,  జంతర్ మంతర్ 02 సన్నాహాలు అటువంటివే!  

ప్రజాస్వామ్య పంథా తప్పి, రాజ్యం దాష్టీకాలకు తలపడుతున్నప్పుడు దానిది కేంద్ర సర్కారు ముఖమైనా, రాష్ట్ర సర్కారు ముఖమైనా ప్రజలు సహించరు. మీడియా తెరపైకి వచ్చిగాని, ఇప్పటికింకా లోలోపలేగాని తెలుగునాట జరుగుతున్న సమావేశాలు, సాగుతున్న సమాలోచనలు అందుకు స్పష్టమైన సంకేతాలే! 

మొదలైన ప్రసవ వేదన

పోరాటాల గడ్డ తెలంగాణలో ఇటీవల కొన్ని సమావేశాలు జరిగాయి. పుష్కరకాలం కింద విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకు వస్తే  దేశమంతటా ఈ రోజున‌‌‌‌ నెలకొన్న రాజకీయ వాతావరణం, ప్రభుత్వాల పనితీరు, ప్రజాస్వామ్య-, రాజ్యాంగబద్ద వ్యవస్థలు బలహీనపడుతున్న తీరు చర్చకు వచ్చింది. ఎన్నో ఉద్యమాల చరిత్ర కలిగిన   తెలంగాణ నేల మీద రాజ్యం దాష్టీకాలను మౌనంగా భరించడంకన్నా గొంతెత్తిన సందర్భాలే ఎక్కువ.  

‘ఫోరం ఫర్ కానిస్టిట్యూషనల్ డెమోక్రసీ’ పేరిట ఇటీవలే నారాయణగూడలో ఒక భేటీ జరిగింది.  జస్టిస్ సుదర్శన్ రెడ్డి,  ప్రొ. కోదండరామ్,  ప్రొ. హరగోపాల్,  జీవన్ కుమార్, వీక్షణం వేణుగోపాల్,  కే.రామచంద్రమూర్తి, వసంతలక్ష్మి,  ప్రొఫెసర్ రమా మెల్కొటే, సంధ్య, జ్యోతి,  డా. గాదె గోపాల్ రెడ్డి (యూఎస్) తదితరులు పాల్గొన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ, స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి ప్రజాస్వామ్య విలువల రక్షణకు ప్రాణాలొడ్డిన మహనీయులను కించపరుస్తున్న పెడధోరణులను ఈ భేటీ నిరసించింది.

 ఎన్నికల కమిషన్‌‌‌‌తో సహా  రాజ్యాంగ వ్యవస్థల్ని, సంస్థల్ని ప్రభుత్వాలు భ్రష్టు పట్టిస్తున్న తీరుపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయాల్లో, పాలనలో, రాజ్యాంగం అమలులో విలువలు, ప్రమాణాలు దిగజారడాన్ని ‘పౌర సమాజం’గా ఉపేక్షించకూడదని, గొంతెత్తి ప్రతిఘటించాలనే ఏకాభిప్రాయాన్ని ఈ సమావేశం వ్యక్తం చేసింది. తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నేత దేశాయి కరుణాకర్ నేతృత్వంలో మరో సమావేశం అదేరోజు ఆశోక్‌‌‌‌నగర్‌‌‌‌లో జరిగింది.  వివిధ ప్రజా సంఘాలు, పౌరసమాజ ప్రతినిధులు, జర్నలిస్టులు ఈ సమావేశంలో పాల్గొని సమకాలీన రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావానికి గల అవసరాలు, అవకాశాలు చర్చకు వచ్చాయి.

కొత్తరూపు తొడిగేనా?

పూచిన ప్రతి మొగ్గా పూవుగా వికసించకపోవచ్చు. కానీ, ప్రతికూల పరిస్థితుల్లోనూ విత్తు మొలకెత్తడం, మొక్కకు మొగ్గ తొడగడం ప్రగతికి సంకేతం. రాజకీయంగా కూడా ప్రత్యామ్నాయ వేదికలు పుట్టుకువస్తున్నాయి. గడిచిన రెండేళ్ల కాలంలో దేశంలో నిషేధిత మావోయిస్టు వ్యవస్థ ధ్వంసమైంది. మెజారిటీ నాయకులు, క్యాడర్ దేశవ్యాప్తంగా లొంగిపోయారు లేకుంటే 
కాల్పుల్లో మరణించారు.   ‘ఇక దేశంలో నక్సలైట్లు లేరు’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి.  

ప్రభుత్వం ముందు లొంగిపోయిన నక్సల్ ముఖ్యనేత దేవ్​జీతో సహా పలువురు మావోయిస్టు నాయకులు మాటల సందర్భంలో వ్యక్తం చేసిన అభిప్రాయమొకటుంది. ‘ఆయుధాలు వదిలాం, సాయుధ పంథా వీడాం, కానీ మా ఆలోచనలు, భావజాలం ఎటుపోతుంది?’ అన్న భావన. ప్రజా సమస్యలున్నంత కాలం విప్లవోద్యమం ఒక రూపాన కాకుంటే మరో రూపాన ఉంటుందన్నారు. మావోయిస్టుల రాజకీయం, క్రియాత్మక వారసత్వాన్ని తీసుకోకుండా పీడిత, తాడిత, బడుగు -బలహీన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేయాలని 
లొంగిపోయిన కొందరు నేతలు భావిస్తున్నారు.

ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక

ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కట్టి, ఎన్నికల రాజకీయాల్లో క్రియాశీలం కావాలని, ప్రజల భూమి హక్కులు, ఉద్యోగ -ఉపాధి అవసరాలు, సామాజిక న్యాయం కోసం పని చేయాలనేది కొందరి ఆలోచన. దానికి స్వాగతమూ లభిస్తోంది. అందులో భాగంగానే లంకా పాపిరెడ్డి (లచ్చన్న) తదితరుల నేతృత్వంలో ఏర్పడ్డ ‘జన తెలంగాణ పార్టీ’ వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. 

ఇదిలావుంటే, కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చేందుకు, పనిచేసేందుకు అవకాశాలను జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఇటీవలే జరిగిన ఒక సమావేశం చర్చించింది. మావోయిస్టు ఉద్యమ పతనానంతరం పరిస్థితులు, కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అవసరమూ చర్చకూ వచ్చింది. విమలక్క గానోత్సవ వేడుకలో మాట్లాడుతూ ‘కమ్యూనిస్టులంతా ఒక్క ఎర్ర జెండా నీడలోకి వచ్చినపుడే నేను వేదిక ఎక్కుతాను, లేకుంటే నన్ను వదిలేయండి’అని ఆధునిక వాగ్గేయకారుడు గోరటి వెంకన్న చేసిన వ్యాఖ్య జనం దృష్టినాకర్షించింది.

భిన్నంగా ఆలోచించాలి

కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టేవారు భిన్నంగా ఆలోచించి ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక, సామాజిక ఎజెండాతో  రావాలని ప్రజలు  కోరుకుంటున్నారు. వివిధ  పరిణామాలు, పరిస్థితులపై సర్వేల నిమిత్తం ప్రజాక్షేత్రంలో గడిపే ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులతో పౌరులు ఇదే చెబుతుంటారు. ప్రజల సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా ‘నువ్వు ఇంత దోచుకున్నావ్’ అంటే, ప్రత్యర్థులు ‘నువ్ ఇంతకన్నా ఎక్కువ దోచుకున్నావ్ కదా’ అని పాలక, -విపక్షాలు అనడం జనాలకు నచ్చడం లేదు. వారే పరస్పరం ‘మీరు ఇన్ని భూములు కాజేశారు’అంటే, ‘మీరు ఇన్ని కాజేశారు’అంటారే తప్ప అలా కాజేయడం తప్పని ఎవరూ ఒప్పుకోకపోవడాన్ని జనం నిరసిస్తున్నారు. ఇటు కవిత పార్టీ పెట్టినా, అటు విజయసాయిరెడ్డి పార్టీ పెట్టడాన్ని ప్రకటించినా... ‘ఇవి ఆ తాను ముక్కలేగా’ అనే  పెదవి విరుపు జనక్షేత్రంలో ఉంది. 

కలిసొచ్చేది సమయం, సందర్భాలే

ఎంతటి ప్రముఖ వ్యక్తి అయినా కొత్త రాజ‌‌‌‌కీయ పార్టీ ప్రారంభించడానికి సమయం, సందర్బం ఉండాలనేది జనాభిప్రాయం.  ప్రొఫెసర్ కోదండరామ్ కూడా 2018లో కాకుండా, ఉద్యమ స్ఫూరితోనే ప్రజల మధ్య ఉంటూ, ఇప్పుడు పార్టీ పెట్టి ఉండాల్సిందంటారు. చిరంజీవి, జయప్రకాశ్ నారాయణ కూడా వారు మొదలెట్టినప్పుడు కాకుండా, 2014లో పార్టీలు ప్రారంభించుంటే ‘క్లిక్’ అయ్యేవి అనే భావన రాజకీయ పరిశీలకుల్లో ఉంది. 

‘కాక్రోచ్ జనతా పార్టీ’కి లభించిన సామాజిక ఆదరణ, మద్దతును, జంతర్ మంతర్ ఉద్యమ స్ఫూర్తినీ చూశాక ప్రజల ఆలోచనల్లో  తేడా వస్తుందేమో? అనిపిస్తుంది.  ఆహ్వానించ దగ్గ పరిణామం.  ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు (క్లైమెట్ ఛేంజ్) వంటి పర్యావరణ అంశాలపై పనిచేస్తున్న ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్-సీజీఆర్‌‌‌‌’ 2018 నుంచి ‘గ్రీన్ మ్యానిఫెస్టో’ తయారు చేస్తోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలనూ తమ మేనిఫెస్టోల్లో దీన్ని ప్రకటించమని డిమాండ్ చేస్తోంది. ముందు ముందు రాజకీయాలను ఇలాంటి అంశాలే ప్రభావితం చేస్తాయనే వాస్తవాన్ని మన పార్టీలు, నేతలు గ్రహించాలి.  తాజా సంకేతాలతో నాకు  శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కవితా పాదాలు గుర్తుకొస్తున్నాయి.  ‘పుడమి తల్లికి పురుటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురిపించాయి’.

- దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్,
 పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.