మాస్కో: రష్యా సార్వభౌమాధికారంపై చిన్నపాటి దాడి జరిగినా ఉపేక్షించేది లేదని, తమ అమ్ములపొదిలోని ‘సర్వ సైనిక అస్త్రాలనూ’ ప్రయోగిస్తామని వెస్ట్రన్ కంట్రీస్‌ను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మక ‘వాల్డాయ్ క్లబ్’ సదస్సులో పుతిన్ ప్రసంగించారు. తమకు స్వచ్ఛందంగా యూరప్ దేశాలపై దాడి చేసే ఉద్దేశం లేదని చెప్పారు.
అయితే, నాటో దేశాలు గనుక రెచ్చగొడితే భీకరంగా బదులిస్తామన్నారు. పోలండ్, లిథువేనియాల మధ్య విస్తరించి ఉన్న రష్యా బాహ్య భూభాగం ‘కలినిన్‌గ్రాడ్’ను ప్రధాన దేశం నుంచి వేరు చేసేందుకు నాటో గగనతల, నావికా దిగ్బంధనానికి కుట్ర పన్నుతోందని రష్యా దౌత్య కార్యాలయాలు ఆరోపించిన నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది కేవలం సమాధానం మాత్రమే కాదు.. మమ్మల్ని భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న సంకేతం. రష్యా భూభాగంపై దాడికి దిగితే దేశ రక్షణార్థం మా సర్వశక్తులనూ ఒడ్డుతాం. ప్రపంచంలో మరెవరి వద్దా లేని విధ్వంసకర ఆయుధాలు ప్రస్తుతం రష్యా వద్ద ఉన్నాయి” అని పేర్కొన్నారు.
పుతిన్‌వి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు: నాటో
పుతిన్ చేసిన అణు హెచ్చరికలపై నాటో కూటమి తీవ్రంగా స్పందించింది. రష్యా ఆరోపణలు నిరాధారమని అధికార ప్రతినిధి అల్లిసన్ హార్ట్ స్పష్టంచేశారు. బాల్టిక్ ప్రాంతంలో రష్యా భూభాగానికి తమ సైనిక విన్యాసాల వల్ల ఎలాంటి ముప్పు లేదని, నాటో కేవలం ఆత్మరక్షణ కోసం ఏర్పాటైన కూటమేనని వివరించారు.
ఎందుకీ ‘కలినిన్‌గ్రాడ్’ రగడ?
బాల్టిక్ సముద్ర తీరంలో నాటో దేశాలైన పోలండ్, లిథువేనియాల సరిహద్దుల నడుమ నలిగి ఉండే రష్యన్ ఎక్స్‌క్లేవ్ ‘కలినిన్‌గ్రాడ్’. రష్యా ప్రధాన నౌకా స్థావరంతోపాటు అణు సామర్థ్యం ఉన్న ‘ఇస్కందర్’ క్షిపణులు ఇక్కడ మోహరించి ఉన్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంపై నాటో నిఘా పెంచడం, ఇటీవల ఆ ప్రాంతంలో విస్తృత ఎయిర్ డ్రిల్స్ నిర్వహించడం రష్యాను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
యుద్ధం ముగింపుపై మోదీ ఆలోచనలు భేష్: పుతిన్
రష్యా–-ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారం చూపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద చాలా మంచి ఆలోచనలు ఉన్నాయని పుతిన్ కొనియాడారు. మాస్కోలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ మధ్య బలమైన, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ, ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించాలని నిరంతరం ప్రస్తావిస్తున్న ప్రపంచ నాయకుల్లో మోదీ ఒకరని పేర్కొన్నారు. రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా యుద్ధం ముగియాలనే స్పష్టమైన ఆకాంక్షతో ఉందని, మోదీ అందించిన ఆలోచనలకు తాము కృతజ్ఞులమని పుతిన్ స్పష్టం చేశారు.
