- మీమ్స్, నినాదాలతో హోరెత్తించిన విద్యార్థి నేతలు
ముంబై: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విద్యార్థి సంఘాలతో కలిసి ముంబైలోని శివాజీ పార్క్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చేపట్టిన ఈ ఆందోళనలో యువకులు, విద్యార్థులు, వివిధ సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యాగ్రహం, అహింసా నినాదాలతో పాటు మీమ్స్, ప్లకార్డులతో హోరెత్తించారు. ‘జ్ఞానూ.. నీకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదా?’, ‘జ్ఞానేశ్ బ్రో, జస్ట్ రిజైన్ చెయ్’, ‘ద్రోహి జ్ఞానూ వెళ్లిపో’ వంటి వ్యాఖ్యలు, వ్యంగ్యాత్మక మీమ్స్ రాసిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. సియాన్‌కు చెందిన మనీశ్ మౌర్య అనే విద్యార్థి ‘మెలడీ’ చాక్లెట్ రాపర్లతో చేసిన హారాన్ని ధరించి.. ‘ఫ్రాడ్ డిటర్జెంట్ పౌడర్’ అని రాసి ఉన్న బ్యానర్‌తో వినూత్నంగా నిరసన తెలిపాడు. పుణెకు చెందిన ఏఐఎస్ఎఫ్ బృందాలు సంగీత వాయిద్యాలు వాయిస్తూ ‘చలే జావో’, ‘వాపస్ దో’, ‘బంద్ కరో’ అంటూ నినాదాలు చేశాయి.
ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతినిరాకరించినప్పటికీ, మధ్యాహ్నం నుంచే ఆందోళనకారులు శివాజీ పార్క్ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు, రైల్వే భద్రతా బలగాలు దేవ్ గిరి రోడ్, సేనా భవన్, దాదర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి సెక్యూరిటీని పెంచారు. కాగా, శివాజీ పార్క్ ఏరియాలో ఆందోళనల వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక ప్రజలు కొంత అభ్యంతరం వ్యక్తం చేసినా నిరసకారులు ఆందోళనను కొనసాగించారు.
