ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మా పోరాటం: ఎంపీ వంశీకృష్ణ

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మా పోరాటం: ఎంపీ వంశీకృష్ణ
  •  
  • సీఈసీ నియామక ప్రక్రియలో పారదర్శకత ఉండాలి: ఎంపీ వంశీకృష్ణ
  • ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని డిమాండ్‌‌ 
  •  

న్యూఢిల్లీ, వెలుగు: దేశ ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు తమ పోరాటం సాగుతుందని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తేల్చి చెప్పారు. దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాం అంటూ గతంలో పార్లమెంట్ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందిస్తూ.. దేశానికి ఎవరి ప్రాణ త్యాగం అవసరం లేదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, ప్రతి ఓటు హక్కు రక్షించడమే అసలు అవసరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీ వంశీకృష్ణ ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామక ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తారు. 2023లో చేసిన చట్టం ప్రకారం సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన సెలక్షన్ కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత, ప్రధాన మంత్రి నామినేట్ చేసే కేంద్ర కేబినెట్ మంత్రి ఉంటారని చట్టం పేర్కొంటోందని గుర్తుచేశారు. “ఎలాంటి ప్రభుత్వం అయినా ఎన్నికల వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించలేని విధంగా, ప్రజలకు మరింత విశ్వాసం కలిగించే నియామక వ్యవస్థను పార్లమెంట్ పరిశీలించాలి” అని వంశీకృష్ణ సూచించారు. 

ఈసీఐ, కేంద్రానిదే బాధ్యత...

ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు తలెత్తితే వాటికి స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఓటరు తన ఓటు హక్కును కాపాడుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. ఓటర్లకు సంబంధించిన అంశాల్లో పారదర్శకత, అప్పీల్‌‌కు అవకాశం, సమర్థవంతమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఉండాలని కోరారు. “ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది. ప్రతి పౌరుడి ఓటు హక్కు రక్షించాలి. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత అందరిదీ” అని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఈసీపై వచ్చిన ఆరోపణలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివాదాలపై సమాధానం ఇవ్వాలని, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.