- భారీ ఎత్తున ప్రోత్సాహకాలు
- 2,3 స్థానాల్లో మహారాష్ట్ర, యూపీ
- ఎస్ అండ్ పీ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: మనదేశంలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం అత్యంత ఆకర్షణీయమైన విధానాలను రూపొందించిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. భూమి, విద్యుత్ వంటి ప్రోత్సాహకాలతో తెలంగాణ ముందు వరుసలో ఉంది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు మౌలిక వసతులు, మూలధన విధానాలలో మెరుగైన ప్యాకేజీలను ప్రకటించాయి. గుజరాత్ విద్యుత్ రంగంలో అత్యంత లాభదాయకమైన విధానాలను అమలు చేస్తోంది.
ఈ జాబితాలో మొదటి నాలుగు రాష్ట్రాలు మెరుగైన స్థానాలను దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, హర్యానా రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారతదేశంలో ప్రస్తుత డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్లు ఉంది. రాబోయే పదేళ్లలో ఈ సామర్థ్యం భారీగా పెరగనుందని, 2031–-2032 ఆర్థిక సంవత్సరం నాటికి 26.3 గిగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. దీనివల్ల విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. వివిధ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీ కారణంగా డేటా సెంటర్ల రంగం దూసుకెళ్తోంది.
వెల్కమ్ టూ హైదరాబాద్
డేటా సెంటర్ల కోసం తెలంగాణ కల్పిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరా, వేగవంతమైన అనుమతులు మల్టీ నేషనల్ కంపెనీలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇప్పటికే అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు భారీ స్థాయిలో డేటా సెంటర్ క్యాంపస్‌లను ఏర్పాటుచేస్తున్నాయి. తెలంగాణ ప్రవేశపెట్టిన ప్రత్యేక డేటా సెంటర్ పాలసీ ద్వారా భూ కేటాయింపులు, రిజిస్ట్రేషన్ రుసుముల మినహాయింపు, సబ్సిడీ ధరలకే విద్యుత్ అందించడం వంటి రాయితీలు లభిస్తున్నాయి.
ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, 5జీ సేవలు పెరగడంతో డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ అవసరాలు అపారంగా పెరిగాయి. కొత్తగా వచ్చే పెట్టుబడులలో అత్యధిక భాగం హైదరాబాద్‌కే దక్కే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా అవతరించిన తెలంగాణ, ఇప్పుడు డేటా సెంటర్ల రాజధానిగానూ ఎదుగుతోంది.
