దేశంలో డిజిటల్ విప్లవం సృష్టించిన UPI వ్యవస్థపై ప్రజాధరణ మసకబారుతోంది. కూరగాయల కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్‌లలో షాపింగ్ వరకు.. రూపాయి బిళ్ల నుంచి వేల రూపాయల వరకు ప్రతి దానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటానికి అలవాటు పడిన ప్రజలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. దీనికి కారణం మోడీ సర్కార్ తెచ్చిన యూపీఐ ఛార్జీలే. అవును తాజాగా ప్రకటించిన రూల్స్ ప్రకారం రూ.2వేల కంటే ఎక్కువ విలువైన కొన్ని మర్చెంట్ (P2M) లావాదేవీలపై 0.4% ఛార్జీ విధించడానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఇది కేవలం వ్యాపారులపై ఉండే భారమేనని.. నేరుగా కస్టమర్లపై ఎలాంటి ట్యాక్స్ పడదని స్పష్టం చెబుతున్నప్పటికీ జనానికి నిజం తెలుసు. వాటిని పరోక్షంగా అయినా సరే తామే కట్టాల్సి వస్తుందని. అదనపు భారాన్ని వ్యాపారులు తమపైకి నెట్టేస్తారన్న భయంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు.
యూపీఐ వాడమని తేల్చిచెప్పిన 85 శాతం జనం..
ఉచితంగా, తక్షణమే జరిగే చెల్లింపులకే ప్రజలు అలవాటు పడటంతో.. అదనపు ఛార్జీలనే పేరు చెప్తేనే జనం ఉలిక్కిపడుతున్నారు. ప్రముఖ సంస్థ లోకల్‌సర్కిల్స్ దేశవ్యాప్తంగా 322 జిల్లాల్లో 45వేల మందికి పైగా యూపీఐ యూజర్లతో నిర్వహించిన తాజా సర్వేలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఒకవేళ రూ.2వేల కంటే ఎక్కువ లావాదేవీలపై ఏదైనా ఫీజు విధిస్తే తాము యూపీఐని అసలు వాడబోమని సుమారు 85 శాతం మంది తేల్చిచెప్పారు. కేవలం 12 శాతం మంది మాత్రమే అదనపు ఛార్జీలు పడినా యూపీఐని కొనసాగిస్తామన్నారు. మిగిలిన వారిలో 27 శాతం మంది క్రెడిట్ కార్డ్‌లకు, 14 శాతం మంది డెబిట్ కార్డ్‌లకు, మరో 21 శాతం మంది ఎలాంటి అదనపు ఛార్జీలు లేని పేమెంట్ మోడ్స్‌కు మారిపోతామని స్పష్టం చేశారు.
కస్టమర్ల నుంచి మండిపాటు..
ఈ సర్వే ఫలితాలు చూస్తే డబ్బులు ఎవరికీ ఊరకే రావు అనే డైలాగ్ అందరికీ గుర్తుకొస్తోంది. ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా సులభంగా సాగిపోవాలని కోరుకునే సామాన్యులు, ఒకవేళ వ్యాపారులు ఎమ్‌డీఆర్ భారాన్ని తమపై మోపితే మళ్లీ పాత పద్ధతులైన క్రెడిట్, డెబిట్ కార్డులు, క్యాష్ పేమెంట్స్ వైపు మళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు దేశంలోని మారుమూల ప్రాంతాలకూ చేరిన తరుణంలో.. కొత్త ఛార్జీలు ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి.
వ్యాపారుల స్పందన ఎలా ఉందంటే?
ఈ భారం కేవలం వినియోగదారులపైనే కాకుండా వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన మరో సర్వేలో 32వేల మందికి పైగా వ్యాపారులు పాల్గొనగా.. రూ.2వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై వచ్చే 0.4% ఎమ్‌డీఆర్ భారాన్ని తాము భరించలేమని 41 శాతం మంది స్పష్టం చేశారు. కేవలం 17 శాతం మంది మాత్రమే ఈ భారాన్ని భరించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మరో 9 శాతం మంది తాము అసలు యూపీఐ పేమెంట్లే స్వీకరించబోమని తేల్చిచెప్పేశారు.
అయితే ప్రభుత్వం మాత్రం దేశంలోని 96 శాతం P2M లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని.. రూ.2వేల లోపు లావాదేవీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్తులో ఈ నిబంధనల వల్ల డిజిటల్ పేమెంట్స్‌పై ప్రజల నమ్మకం సడలి, క్యాష్ లావాదేవీలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందనే చర్చ ఆర్థిక నిపుణుల్లో తీవ్రంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా చోట్ల వ్యాపారులు నో యూపీఐ పేమెంట్స్ అంటూ బోర్డులు కూడా పెట్టేయటంతో జనం కూడా క్యాష్ క్యారీ చేసేందుకు అలవాటు పడటం స్టార్ట్ అయిపోయింది దేశవ్యాప్తంగా.
