తిరుపతిలోని శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి కంపెనీ భవనం పూర్తిగా నేలమట్టం అయింది. శిథిలాల కింద చిక్కుకుని నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు చనిపోయాడు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీంలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులను మోహన్ (20), గౌరబ్ రాయ్ (36), చిన్న మస్తాన్ (36), రమేష్ (40)గా గుర్తించారు. మోహన్ నాయుడు కుప్పం, గౌరబ్ రాయ్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడిగా అధికారులు గుర్తించారు. చిన్న మస్తాన్ చెరివి గ్రామానికి చెందిన వారు కాడగా, రమేష్ తమిళనాడులోని మాదరపాకానికి చెందినవారుగా గుర్తించారు. ఇదిలా ఉండగా, పేలుడులో తీవ్రంగా గాయపడిన 36 ఏళ్ల వాసు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఘటన సమయంలో యూనిట్ లో ఎంతమంది కార్మికులు ఉన్నారనేది తెలిసిరాలేదు. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
పేలుడు సంభవించిన సమయంలో పరిశ్రమలో సుమారు 30 మంది కార్మికులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పేలుడు ధాటికి పలువురు గాయపడటంతో వారిని తొలుత శ్రీసిటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బాయిలర్‌లో టెక్నికల్ లోపం వల్ల పేలుడు జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది.
