ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాలు ఊహించని మార్పులకు లోనవుతున్నాయి. మనుషులు చేస్తున్న పనుల వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలను సముద్రాలు పీల్చుకోవడంతో భూమిపై వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి సున్నితమైన ద్వీప దేశాల వరకు దీని దుష్ప్రభావాలను ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మెర్కేటర్ ఓషన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా శాస్త్రవేత్తలు సుమారు 40 ఏళ్లుగా ఉపగ్రహ, బాయ్, సెన్సార్ డేటాను విశ్లేషించి రూపొందించిన పదవ 'కోపర్నికస్ ఓషన్ స్టేట్ రిపోర్ట్' ఈ ఆందోళనకర నిజాలను వెల్లడించింది. వేడెక్కుతున్న నీరు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, క్షీణిస్తున్న సముద్ర జీవాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని రిపోర్ట్ హెచ్చరిస్తోంది.
రెండు రెట్లు వేగంగా పెరుగుతున్న సముద్రాల వేడి
శిలాజ ఇంధనాల దహనం వంటి చర్యల ద్వారా వెలువడే అదనపు వేడిలో దాదాపు 90 శాతాన్ని మహాసముద్రాలే పీల్చుకుంటున్నాయి. తద్వారా ఇవి గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని రక్షించే ఒక రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ సముద్రాలకు పెను శాపంగా మారుతోంది. గత 20 ఏళ్లతో పోలిస్తే సముద్రాలు వేడెక్కుతున్న వేగం రెట్టింపైందని నివేదిక స్పష్టం చేస్తోంది. 2023, 2024.. తాజాగా 2026 సంవత్సరాలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలను తాకాయి. కేవలం 2025 ఒక్క సంవత్సరంలోనే సముద్రాలు అదనంగా 23 జెట్టాజౌల్స్ వేడిని పీల్చుకున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరంలో వినియోగించే మొత్తం శక్తితో పోలిస్తే దాదాపు 40 రెట్లు ఎక్కువ. ఈ అదనపు ఉష్ణోగ్రతల వల్ల సముద్రంలో అసాధారణ వడగాల్పులు ఏర్పడటంతో పాటు శక్తివంతమైన తుఫానులు ముంచుకొస్తున్నాయి.
పెరుగుతున్న సముద్ర మట్టాలు..
1999 నుంచి ప్రపంచ సముద్ర మట్టాలు సగటున ప్రతి సంవత్సరం 3.8 మింటోమీటర్ల చొప్పున పెరుకుంటూ వస్తున్నాయి. దీనివల్ల తీర ప్రాంతాల్లో నివసించే కోట్లాది మంది ప్రజలకు ముప్పు పొంచివుంది. కాలుష్యం కారణంగా సముద్రాల నీరు మరింత ఎసిడిక్ చెందుతోంది. 1985 నుంచి సముద్రాల ఎసిడిటీ ఏకంగా 17 శాతం పెరిగింది. దీనివల్ల ఆయిస్టర్స్, రొయ్యలు, పగడపు దిబ్బలు తమ అస్థిపంజరాలను, కవచాలను ఏర్పరచుకోవడం కష్టతరంగా మారుతోంది. ఇక ఆర్కిటిక్ ప్రాంతంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత 40 ఏళ్లలో ఇక్కడి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సుమారు 4.6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి.
యూరోపియన్ సముద్రాలపై తీవ్ర ఒత్తిడి..
యూరప్‌లోని మధ్యధరా, బాల్టిక్ సముద్రాలు తీవ్రమైన వడగాల్పులను ఎదుర్కొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సగటు కంటే 4.6 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదయ్యాయి. ఈ విపరీత వాతావరణ మార్పుల కారణంగా స్పెయిన్ తీర ప్రాంతంలో భారీ అలలు ఎగసిపడి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించాయి. చిన్న అభివృద్ధి చెందుతున్న ద్వీప దేశాలు సముద్ర మట్టాల పెరుగుదల, తీవ్రమైన తుఫానులు, పగడపు దిబ్బల నాశనం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని.. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు పెద్ద సవాలుగా మారిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు చర్యలు అత్యవసరం..
వాతావరణ మార్పుల తీవ్రతను తగ్గించేందుకు, భవిష్యత్ విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సముద్రాలపై నిరంతరం నిఘా ఉంచాలని తాజా రిపోర్ట్ కోరుతోంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, మట్టాలు ఎగబాకుతుండటం, పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటుండటం రాబోయే ఉపద్రవాలకు సంకేతాలు. కాలం చెల్లకముందే ఈ సమస్యపై ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా స్పందించి, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
