- ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదు
- చర్చ జరపాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ ఇచ్చానని వెల్లడి
- ప్రతిపక్షాలు కూడా సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని సవాల్
న్యూఢిల్లీ: విద్యార్థుల నిరసనలు, నీట్ పరీక్ష సంబంధిత అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు సిద్ధమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. లోక్‌సభ ఈ అంశాలపై చర్చ జరపాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు తాను లేఖ ఇచ్చానని వెల్లడించారు.
అలాగే చర్చలో పాల్గొనేందుకు అంగీకరిస్తూ ప్రతిపక్షాలు కూడా స్పీకర్‌కు రాతపూర్వక లేఖ ఇవ్వాలని సవాల్ విసిరారు. బుధవారం పార్లమెంట్ వద్ద మీడియాతో అమిత్ షా మాట్లాడారు. ‘‘చర్చ ఈరోజే ప్రారంభమైతే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. ఇందుకోసం నేను మొత్తం ప్రొసీడింగ్స్ పూర్తయ్యే వరకూ సభలో ఉంటాను’’ అని ఆయన స్పష్టం చేశారు.
చర్చలో పాల్గొనాలా? లేక పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించాలా? అనేది ఇప్పుడు ప్రతిపక్షాల చేతిలోనే ఉందన్నారు. ‘‘ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా వారు స్పీకర్‌కు లేఖ సమర్పించాలి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం”అని చెప్పారు. ఏ అంశంలోనూ ప్రభుత్వానికి దాచడానికి ఏమీ లేదన్నారు. తాను చర్చ నుంచి పారిపోతున్నానని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై హోం మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారతదేశ బహిరంగ, పార్లమెంటరీ చర్చల్లో ‘కనిపించడం లేదు’, ‘పరారీలో ఉన్నారు’ వంటి పదాలు ఇటీవలి కాలంలోనే వినిపిస్తున్నాయని అన్నారు. జులై 20న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా వస్తున్నానని, పార్లమెంట్ భవనంలోని తన చాంబర్‌లోనే కూర్చుంటున్నానని, అయితే ప్రతిపక్షాలు ఏ రోజూ సభనూ సజావుగా సాగనివ్వడం లేదని తెలిపారు.
‘‘సభ సజావుగా సాగనప్పుడు ఎవరైనా లోపలికి వెళ్లడంలో అర్థం ఏముంది?”అని అమిత్ షా ప్రశ్నించారు. ‘‘వారు చర్చ జరగాలని అసలు కోరుకోవడం లేదు. ఇప్పుడు ఎవరు నిజంగా పారిపోతున్నారో ప్రజలే నిర్ణయించుకోనివ్వండి. ప్రతిపక్షాలు అసలు చర్చను ఎందుకు కోరుకోవడం లేదనే అంశంపై కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నా” అని ఆయన చెప్పారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒక్క రోజు ముందు (బుధవారం) అమిత్ షా ఈ ప్రకటన చేశారు.
