ముంబై: పండుగ సీజన్ మొదలు కానుండడంతో గిగ్ వర్కర్ల నియామకాలు ఊపందుకోనున్నాయి. క్విక్ కామర్స్, ఈ–-కామర్స్ ఆర్డర్లు పెరగడంతో లక్షల్లో ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. కిందటేడాది పండుగ సీజన్‌లో దాదాపు 12 లక్షల గిగ్ వర్కర్ల నియామకాలు జరిగాయి.
ఈసారి ఈ నెంబర్ 15 నుంచి 20 శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉందని హెచ్ఆర్ సంస్థ 'టీమ్‌లీజ్ సర్వీసెస్' బుధవారం ఓ రిపోర్ట్‌లో పేర్కొంది.
ఈ–-కామర్స్, క్విక్ కామర్స్, ఆర్గనైజ్డ్ రిటైల్, లాజిస్టిక్స్, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలలో నియామకాలు ఎక్కువగా జరుగుతాయని అంచనా వేసింది. డెలివరీ అసోసియేట్లు, వేర్‌హౌస్, డార్క్ స్టోర్లలో పనిచేసే సిబ్బంది, ప్యాకర్లను భారీగా నియమించుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఇన్-స్టోర్ ప్రమోటర్లు, క్యాషియర్లు, ఇన్వెంటరీ కోఆర్డినేటర్లు, రిటర్న్స్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ల అవసరం కూడా పెరిగింది.
ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల జీతాలు 8 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని, కొత్త కార్మిక చట్టాల వల్ల చేతికి వచ్చే నికర వేతనం 5-–8శాతం వరకు పెరుగుతుందని టీమ్‌లీజ్ అంచనా వేసింది.
నియామకాల్లో టైర్-1 మెట్రో నగరాల వాటా 40.5 శాతంగా ఉంటుందని, ముఖ్యంగా దక్షిణాది, పశ్చిమ భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణే నగరాల్లో గిగ్ వర్కర్ల నియామకాలు భారీగా జరుగుతాయని వివరించింది. కాగా, స్వాతంత్య్ర దినోత్సవం నుంచి దీపావళి, న్యూ ఇయర్ వరకు పండుగ సీజన్ కొనసాగుతుంది.
