- తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపై బలంగా వాదిస్తం: మంత్రి శ్రీధర్ బాబు
- రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశానికి హాజరై తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపై బలంగా వాదనలు వినిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు నీటి వాటాల విషయంలో అన్యాయం చేసిందే బీఆర్‌ఎస్ పార్టీ అని మండిపడ్డారు.అసత్యాలతో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.
'హిల్ట్ పాలసీ'తో హైదరాబాద్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం వస్తే ఆ పాలసీని రద్దు చేస్తామంటూ పారిశ్రామికవేత్తలను కేటీఆర్ భయపెట్టడం సరికాదన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ధోరణిని బీఆర్ఎస్ మానుకోవాలని సూచించారు. తమపై ఉన్న రాజకీయ కక్షను తెలంగాణ ప్రజలపై చూపవద్దని కోరారు. ఇప్పటికే ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం కోల్పోయారని.. అందుకే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పారన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికే ముఖాముఖి
ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలను నేరుగా వినేందుకే ప్రతీ బుధవారం గాంధీభవన్‌లో 'ప్రజలతో ముఖాముఖి' నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆ తర్వాత పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని వివరించారు.
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్న సమయంలో గాంధీభవన్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యలను విన్నవించుకునేందుకు నిరుద్యోగులు లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా.. పోలీసులు ముందస్తు చర్యగా వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట జరిగి పోలీసులు భారీగా మోహరించారు.
ఈ క్రమంలోనే ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కారులో గాంధీభవన్‌లోకి వస్తుండగా ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను పోలీసులు గుర్తించకపోవడంతో కారును లోపలికి అనుమతించలేదు. దీంతో గాంధీభవన్ ఇన్ చార్జ్ కుమార్ రావుపై సచిన్ సావంత్ అసహనం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు అనుమతించడంతో ఆయన లోపలికి వెళ్లారు. అయితే, సామాన్య ప్రజలు గాంధీభవన్‌కు స్వేచ్ఛగా వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కుమార్ రావుకు సచిన్ సావంత్ సూచించారు.
