సినిమా ఛేజింగ్ను మించి.. 40 కి.మీ. కారు రూఫ్పైన పోలీస్.. స్మగ్లర్లను పట్టుకున్న తీరుకు హాట్సాఫ్!

సినిమా ఛేజింగ్ను మించి.. 40 కి.మీ. కారు రూఫ్పైన పోలీస్.. స్మగ్లర్లను పట్టుకున్న తీరుకు హాట్సాఫ్!

కారులో పారిపోతున్న విలన్లను పట్టుకోవడానికి హీరో కారు రూఫ్ పై దూకి.. ఎంతో సాహసంతో చేసే ఛేజింగ్ సీన్స్ సినిమాల్లో ఎన్నో చూసుంటాం. రియల్ లైఫ్ లో అలాంటి ఘటనలు అరుదు. కానీ సినిమా  ఛేజింగ్ మించిన సీన్ తమిళనాడులో జరిగింది. ఒక పోలీస్ చూపించిన తెగువ, గుండె ధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాట్సాఫ్ అంటూ పోలీస్ ను తెగ పొగిడేస్తున్నారు. ఆ ఛేజింగ్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

కోయింబత్తూరులో జరిగింది ఈ సాహస ఘటన. సుమారు 300 కేజీల గుట్కా, పొగాకు ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేస్తున్న దుండగులను 40 కి.మీ. ఛేజ్ చేసి పట్టుకున్నారు తమిళనాడు పోలీసులు. ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ సినిమా హీరోలాగా రూఫ్ పై ప్రాణాలకు తెగించి వేలాడుతూ ఛేజింగ్ చేసి దుండగులను పట్టించారు. 

పోలీసుల రెగ్యులర్ చెకప్స్ లో భాగంగా వాహనాలను ఆపుతున్న క్రమంలో.. ఒక కారు వెనుక భాగంలో భారీగా నిషేధిత గుట్కా, పొగాకు పదార్థాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో తనిఖీ చేస్తుండగా  ఎస్సై తో పాటు  పోలీసులను దొబ్బేసి పరారయ్యారు దుండగులు. అది గమనించిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ కారు రూఫ్ పైకి దూకి పట్టుకున్నాడు. 

కారుపైనున్న పోలీసును వదిలించుకునేందుకు స్పీడ్ బ్రేకర్లు, గుంతల గుండా పోనిచ్చినా వదలకుండా అలాగే పట్టుకున్నారు మురుగన్. కోయింబత్తూరు టోల్ ప్లాజా దగ్గర టోల్ గేట్లను గుద్దుకుని కారు లగాయించింది. 

అయితే కారుపైన పోలీసు ఉండటం చూసిన స్థానికులు.. ఇదేదో ఛేజింగ్ లా ఉందని స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశారు. ఛేజ్ గురించి తెలుసుకున్న పోలీసులు.. తిరుప్పూర్ జిల్లా నుంచి అంబులెన్స్ తో వచ్చి.. ఛేజ్ లో పాల్గొన్నారు. మొత్తానికి 40 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత.. పోలీసు వాహనాలు, అంబులెన్సు కారును చుట్టుముట్టి అడ్డగించాయి.

►ALSO READ | ఎంపీ తేజస్వి సూర్య భార్యకు రైల్లో చేదు అనుభవం.. ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్..

కారులో ఉన్న ముగ్గురు రాజస్థాన్ నిందితులు బాబు ధారా (27, రాజేష్ (23), సురేష్ (20) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయినట్లు చెప్పారు. బెంగళూరు నుంచి కోయంబత్తూరుకు పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. 

40 కి.మీ. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన వేల్మురుగన్ ను పోలీసు శాఖ అభినందించింది. అలాగే ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఇతర పోలీసులు, అంబులెన్స్ సిబ్బందిని కూడా మెచ్చుకున్నారు ఉన్నతాధికారులు.