తెలంగాణలో 33 జిల్లాలు: 217 మందిలో 209 ఓటర్లు హైదరాబాద్ వాళ్లే.. HCAపై TCA ఫైర్

తెలంగాణలో 33 జిల్లాలు: 217 మందిలో 209 ఓటర్లు హైదరాబాద్ వాళ్లే.. HCAపై TCA ఫైర్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)  వ్యవహారాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. బీసీసీఐ అంబడ్‌సమన్ ఇచ్చిన ఉత్తర్వులు హెచ్‌సీఏ నిబంధనల ఉల్లంఘనలకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లుగా భావించరాదని టీసీఏ స్పష్టం చేసింది. మెరిట్ ఆధారంగా విచారణను ఇంకా తెరిచి ఉంచినట్లు పేర్కొంది.

217 మందిలో 209 మంది పట్నం వాళ్లే: 
 
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లోని 217 మంది ఓటింగ్ సభ్యుల్లో 209 మంది హైదరాబాద్ నగరానికి చెందినవారే కావడంపై టీసీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడినా.. రాష్ట్ర క్రికెట్ పాలన మాత్రం హైదరాబాద్‌కే పరిమితం కావడం అన్యాయమని పేర్కొంది. 

జిల్లాలు, గ్రామీణ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఏదీ: 

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్లకు సముచిత ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించేందుకు బీసీసీఐ జోక్యం చేసుకోవాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) డిమాండ్ చేసింది. తెలంగాణలోని క్రికెట్ ప్రతిభకు, మౌలిక వసతులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. సికింద్రాబాద్ క్లబ్, ఫతే మైదాన్ క్లబ్ లాంటి క్లబ్‌లకు పూర్తి సభ్యత్వాలు, ఓటింగ్ హక్కులు ఏ ప్రాతిపదికన కల్పించారో హెచ్‌సీఏ రికార్డుల ఆధారంగా క్లారిటీ టీసీఏ కోరింది.

►ALSO READ | ఆసియా గేమ్స్లో భారత్ సత్తా.. స్క్వాష్‌లో అనాహత్, అభయ్ సింగ్‌లకు సిల్వర్ మెడల్స్!

హెచ్‌సీఏ తీరుపై సుప్రీంకోర్టుకు పోతాం: 

హెచ్‌సీఏ వ్యవహారాలపై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పీఐఎల్‌లు, సింగిల్ మెంబర్ కమిటీ, రిట్ అప్పీళ్ల అంశాలను కూడా ఉత్తర్వులు ప్రస్తావించాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు న్యాయం జరిగే వరకు చట్టపరమైన వేదికలపై తమ పోరాటం కొనసాగుతుందని టీసీఏ తేల్చి చెప్పింది.