ఆసియా గేమ్స్లో భారత్ సత్తా.. స్క్వాష్‌లో అనాహత్, అభయ్ సింగ్‌లకు సిల్వర్ మెడల్స్!

ఆసియా గేమ్స్లో భారత్ సత్తా.. స్క్వాష్‌లో అనాహత్, అభయ్ సింగ్‌లకు సిల్వర్ మెడల్స్!

Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడలలో (Asian Games 2026) భారత స్క్వాష్ క్రీడాకారులు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. పతకాల పట్టికలో ఇండియా తరఫున స్వర్ణాలు సాధించాలన్న వారి కల చివరి మెట్టుపై చేదిరిపోయింది. మహిళల, పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో బరిలోకి దిగిన యువ సంచలనం అహనాత్ సింగ్, సీనియర్ ప్లేయర్ అభయ్ సింగ్ (Abhay Singh) హోరాహోరీగా పోరాడినప్పటికీ రజత పతకాలతో (Silver Medals) సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

స్వర్ణం కోల్పోయిన అహనాత్ సింగ్: 

మహిళల స్క్వాష్ సింగిల్స్ ఫైనల్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన యువ క్రీడాకారిణి అహనాత్ సింగ్ (Anahat Singh) మలేషియాకు చెందిన స్టార్ ప్లేయర్ శివసంగరి సుబ్రమణియంతో తలపడింది. కేవలం 27 నిమిషాల పాటు కొనసాగిన ఈ పోరులో అహనాత్ 0–3 తేడాతో ఓడిపోయింది. తొలి రెండు గేమ్‌లను 4–11, 4–11 తో కోల్పోయిన అహనాత్.. మూడో గేమ్‌లో కొంత పోటీనిచ్చినప్పటికీ 7–11 తేడాతో వెనుకంజ వేసి సిల్వర్ తోనే సరిపెట్టుకుంది.

చరిత్ర సృష్టించిన అభయ్ సింగ్: 

పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో భారత నంబర్ వన్ అథ్లెట్ అభయ్ సింగ్ మలేషియాకు చెందిన ప్రపంచ 17వ ర్యాంక్ ప్లేయర్ ఎయిన్ యో చేతిలో 9-11, 5-11, 5-11 తేడాతో పోరాడి ఓడిపోయాడు. ఈ ఓటమితో అభయ్ సిల్వర్ పతకం సాధించినప్పటికీ, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే సువర్ణావకాశాన్ని తృటిలో కోల్పోయాడు (స్వర్ణం గెలిచిన వారికి ఒలింపిక్స్ బెర్త్ లభిస్తుంది). కానీ, దిగ్గజ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్ తర్వాత ఆసియా క్రీడల సింగిల్స్ ఫైనల్ చేరిన రెండో భారత మెన్స్ ప్లేయర్ గా అభయ్ సింగ్ రికార్డు సృష్టించాడు. అర్జున అవార్డు గ్రహీత అయిన అభయ్.. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ పతకాన్ని సాధించడం విశేషం.

32కి చేరిన భారత్ పతకాల సంఖ్య:

ఈ రెండు రజత పతకాలతో భారత్ పతకాల పట్టిక మరింత బలపడింది. ప్రస్తుత ఆసియా క్రీడలలో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 32కి చేరింది. ఇందులో 4 స్వర్ణాలు, 14 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల వేటలో టీమిండియా అథ్లెట్లు అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు.