మాలలకు జరుగుతున్న అన్యాయంపై కేబినెట్‌‌‌‌ లో చర్చిస్తా..మాల సర్పంచ్ లు, కౌన్సిలర్లతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశం

మాలలకు జరుగుతున్న అన్యాయంపై  కేబినెట్‌‌‌‌ లో చర్చిస్తా..మాల సర్పంచ్ లు, కౌన్సిలర్లతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశం
  •    మాలల హక్కుల కోసం పోరాడుతా: మంత్రి వివేక్ వెంకటస్వామి 

 పాపన్నపేట/ కొల్చారం, వెలుగు: మాలలకు జరుగుతున్న అన్యాయం గురించి కేబినెట్‌‌‌‌లో మాట్లాడతానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలను ఆయన సందర్శించారు. ఆలయంలో వన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

 అనంతరం హరిత హోటల్‌‌‌‌లో జిల్లాలోని మాల సర్పంచ్‌‌‌‌లు, కౌన్సిలర్లతో జరిగిన మీటింగ్‌‌‌‌లో మాట్లాడారు. మాదిగల సంఖ్య ఎక్కువుందని, మాలలు చాలా తక్కువగా ఉన్నారని ప్రచారం చేశారని, దీంతో అన్ని పార్టీల్లో మాలలను కేర్ చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం ఏర్పడిందని, దీన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మాలలకు అన్యాయం జరుగుతున్నందు వల్లనే తాను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశామని గుర్తుచేశారు. ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి 2011 సెన్సెస్ తీసుకొని వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశారని, అందులో చాలా లోపాలు ఉన్నాయని, కమిషన్‌‌‌‌ మాలలకు అన్యాయం చేసిందన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అన్ని డిపార్ట్‌‌‌‌మెంట్ల నుంచి డేటా తీసుకోలేదన్నారు. రోస్టర్ విధానంలో మాలలకు జరిగిన అన్యాయాన్ని మేడారంలో జరిగిన కేబినెట్ మీటింగ్‌‌‌‌లో లేవనెత్తానని గుర్తుచేశారు. త్వరలో జరగబోయే కేబినెట్‌‌‌‌లో కూడా మాలలకు రోస్టర్ విధానంలో జరుగుతున్న అన్యాయంపై చర్చిస్తానని చెప్పారు. 

మాలల బలాన్ని ప్రదర్శించలేకపోతున్నామని, మాలల హక్కుల కోసం ఎవరూ ముందుకొచ్చి పోరాడటం లేదన్నారు. ఇప్పుడిపుడే మాలల్లో చైతన్యం వస్తోందని చెప్పారు. మాలల హక్కుల సాధన కోసం తాను ముందుండి పోరాడతానని, అవసరమైతే రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించిన విషయాన్ని మంత్రి వివేక్‌‌‌‌ గుర్తుచేశారు. హక్కుల ఉద్యమానికి మాల ఉద్యోగులు తమ వంతు కాంట్రిబ్యూషన్ చేయాలని, ఎలక్షన్లలో మాలల సత్తా చూపించాలని సూచించారు.