మనోహరాబాద్, వెలుగు: మెదక్‌జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్‌గ్రామంలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ కేంద్రంపై సివిల్‌స ప్లైస్ అధికారులు, పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. జిల్లా సివిల్ సప్లైస్ ఇన్‌స్పెక్టర్ తాటి నర్సింలు, మనోహరాబాద్ ఎస్సై సుభాష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.
రాజస్తాన్‌కు చెందిన ఘనశ్యామ్ కుమావత్(30) ప్రస్తుతం కాళ్లకల్‌లో నివాసం ఉంటూ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. 200కు పైగా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి రీఫిల్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భారత్ గ్యాస్, ఇండియన్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల నుంచి చిన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదు మేరకు మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
