నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ.. రాష్ట్రానికే మణిహారం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ.. రాష్ట్రానికే మణిహారం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రాష్ట్రానికే మణిహారమని మంత్రి తుమ్మల  నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్టరీలో గత మార్చి నుంచి ఇప్పటివరకు 70 వేల టన్నుల గెలలను ప్రాసెస్ చేసినట్లు చెప్పారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ప్రస్తుతం 11 ఫ్యాక్టరీలు ఉన్నాయని,  రిలయన్స్ సంస్థ కూడా రిఫైనరీతో కూడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ముందుకు వచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుంటే.. అందులో సగానికి పైగా తోటలు తెలంగాణ, ఏపీలోనే ఉన్నాయన్నారు.

మరో మూడు, నాలుగేండ్లలో తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరిగేలా చూడడడమే తన లక్ష్యమన్నారు. నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో రిఫైనరీ పనులు నడుస్తున్నాయని, వచ్చే సంవత్సరం నాటికి పనులు పూర్తై ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు.

ఎంతటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఎలాంటి  ఇబ్బంది లేకుండా స్థిర అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆయిల్ పామ్ తోటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట సిద్దిపేట ఆర్డీవో సదానందం, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి ఉన్నారు.