- మెదక్ జిల్లాలో యాక్షన్ ప్యాడీ బకాయిల రికవరీకి అధికారుల కసరత్తు
- మిల్లర్ల నుంచి ఆశించిన స్పందన కరువు
మెదక్, వెలుగు : కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కు సంబంధించిన పాత బకాయిల వసూలుపై సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2022–23 సీజన్ కు సంబంధించి వేలం వేసిన ధాన్యం (యాక్షన్ ప్యాడీ) తాలూకు వందల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలన్నీ వసూలు చేయాల్సిందేనని సీఎం ఆదేశించడంతో రికవరీకి అధికారులు చర్యలు చేపట్టారు.
పెండింగ్లో 81,918 టన్నులు..
మెదక్ జిల్లాలో 2022 –23 సీజన్ లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొన్న 2,39,152 టన్నుల ధాన్యాన్ని వివిధ మండలాల పరిధిలో ఉన్న 74 రైస్ మిల్లులకు కస్టం మిల్లింగ్ కోసం కేటాయించారు. ఇందులో కేవలం 45,699 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మాత్రమే మిల్లర్ల నుంచి సరఫరా అయ్యింది. మెజారిటీ మిల్లర్లు సీఎంఆర్ సరఫరా చేయలేదు. జిల్లా వ్యాప్తంగా ఆయా మిల్లుల నుంచి 81,918 టన్నుల ధాన్యం పెండింగ్ లో ఉంది. ఇందుకు సంబంధించి మిల్లర్ల నుంచి రూ.195.89 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా ఇందులో ఇప్పటి వరకు రూ.85.74 కోట్లు రికవరీ అయ్యాయి. ఇవి పోను ఇంకా రూ.110.73 కోట్లు బకాయి ఉన్నాయి. ఇందులో అత్యధిక శాతం ఆరుగురు మిల్లర్ల నుంచే రావాల్సి ఉంది. వారిలో ఒక్కొకరు రూ.6 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు బకాయి ఉండటం గమనార్హం.
ప్రత్యేక దృష్టి..
యాక్షన్ ప్యాడీకి సంబంధించిన పాత బకాయిల వసూలుపై సివిల్ సప్లై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కానీ మిల్లర్ల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ధాన్యం కొనుగోలు సీజన్ లలో సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయింపు నిలిపి వేస్తున్నారు. ఇదివరకే పలు మిల్లులు ఈ జాబితాలో ఉన్నాయి. ఇపుడు మరిన్ని ఎక్కువ మిల్లులు ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇది రానున్న వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు పై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
