దుబ్బపల్లి కష్టం తీరినట్టే ! కేటీపీపీ నిర్వాసితులకు ఉపశమనం.. ఆర్అండ్ఆర్ కింద రూ. 68 కోట్లు చెల్లింపు

దుబ్బపల్లి కష్టం తీరినట్టే ! కేటీపీపీ నిర్వాసితులకు ఉపశమనం.. ఆర్అండ్ఆర్ కింద రూ. 68 కోట్లు చెల్లింపు
  • ఊరు తరలింపునకు ప్రభుత్వం చర్యలు
  • పునరావాస ప్యాకేజీ పెంచాలని గ్రామస్తుల డిమాండ్

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: తెలంగాణకు వెలుగులు పంచుతున్న కేటీపీపీ.. దుబ్బపల్లి వాసులను అనారోగ్యాలకు కారమవుతోంది. 15 ఏండ్లుగా కేటీపీపీ నుంచి వెలువడుతున్న బూడిదతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూ నిర్వాసితుల గోడు విన్న ప్రభుత్వం వారిని బూడిద కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలు చేపట్టింది.

ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా రూ.68 కోట్లు విడుదల చేసి, గ్రామస్తుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ వేగంగా చేపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పునరావాస ప్యాకేజీతో ఇండ్లు నిర్మించుకోలేమని, స్థలం కేటాయించిన చోట ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని లేదా పునరావాస ప్యాకేజీ పెంచాలని గ్రామస్తులు డిమాండ్​ చేస్తున్నారు. అప్పుడే తాము ఊరు ఖాళీ చేసి వెళ్తామని స్పష్టం చేస్తున్నారు.

15 ఏండ్లుగా బూడిద వెతలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ శివారు దుబ్బపల్లి సమీపంలో 2006లో కేటీపీపీ నిర్మాణానికి గ్రామస్తుల నుంచి సుమారు 900 ఎకరాల భూమిని సేకరించారు. 1,100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తయి 2010లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. దుబ్బపల్లిని ఆనుకుని సుమారు 100 ఎకరాల్లో బూడిద నిల్వ చేసేందుకు డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. దీంతో సైలోల నుంచి వెలువడుతున్న బూడిద పంట పొలాలను కమ్మేయడంతో పాటు గ్రామస్తులను అనారోగ్యానికి గురిచేస్తోంది. పలువురు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.

ఈ సమస్యపై గ్రామస్తులు 2012లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు కేటీపీపీని ముట్టడించారు. జెన్‌‌‌‌కో సీఎండీని సైతం అడ్డుకుని తమ సమస్యలను వివరించారు. అనంతరం 2014లో సర్వే నిర్వహించగా, 2019లో పీఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ ద్వారా పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టారు.

2023లో గజానికి రూ.4,000 చొప్పున పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుని, 300 మంది నిర్వాసితులకు సుమారు రూ.77 కోట్లు పంపిణీ చేసింది. 2023 నుంచి భూ నిర్వాసితుల పునరావాస సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్‌‌‌‌లోనే ఉంది. గ్రామస్తుల నుంచి ఒత్తిడి పెరగడంతో తాజాగా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రభుత్వం దుబ్బపల్లి తరలింపునకు చర్యలు చేపట్టింది. ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ కింద రూ.68 కోట్లు విడుదల చేసి, గ్రామంలోని 448 మందికి అవార్డు కాపీలను అందజేశారు.

కలెక్టర్ రాహుల్‌‌‌‌ శర్మ ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం ఒక్కో నిర్వాసితుడికి రూ.7.80 లక్షలు అందిస్తున్నారు. ఈ మొత్తంతో ఇంటి నిర్మాణం పూర్తి చేయడం సాధ్యం కాదని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం ప్యాకేజీని పెంచాలని, లేదంటే ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఆఫీసర్ల కొర్రీలపై ఆవేదన..
ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ అందించే విషయంలో క్షేత్రస్థాయి అధికారులు కొర్రీలు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల ఎంపికకు 2019ను కట్‌‌‌‌ఆఫ్‌‌‌‌ ఇయర్‌‌‌‌గా గుర్తించి నష్టపరిహారం అందించినప్పటికీ, మూడేళ్ల తర్వాత ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ విడుదల చేశారని చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో భారీ వర్షాలకు కొన్ని ఇండ్లు నేలమట్టమైనప్పటికీ వాటికి పునరావాస ప్యాకేజీ ఇవ్వడం కుదరదంటూ ఆఫీసర్లు అభ్యంతరాలు చెబుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఊరు ఏర్పడిన నాటి నుంచి నివసిస్తున్న సుమారు 30 మంది నిర్వాసితులకు నష్టపరిహారం అందించినప్పటికీ, పునరావాసం కల్పించే విషయంలో కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. పునరావాస ప్యాకేజీ అందించి, సమస్యను పూర్తిగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను..
కేటీపీపీ నుంచి వస్తున్న దుమ్ము, ధూళి, బూడిదతో దుబ్బపల్లి వాసులు పడుతున్న గోడును సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. మూడేండ్లుగా పెండింగ్ లో ఉన్న పునరావాస ప్యాకేజీని విడుదల చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాల వద్ద రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.18 కోట్లు కేటాయించింది.

పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచాం. పునరావాస ప్యాకేజీ అందని వారు ఆందోళన చెందొద్దు. ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతనే దుబ్బపల్లిని ప్రభుత్వం కేటాయించిన స్థలాల వద్దకు తరలించుతాం.

గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే భూపాలపల్లి