కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ 2026 అక్టోబర్ 02న కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టనున్న నిరసనకు మద్ధతు తెలిపారు హక్కుల కార్యకర్త సోనం వాంగ్చుక్. జ్ఞానేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జవాబుదారీతనం వ్యవహరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీజేపీ కి మద్ధతు ఇస్తున్నట్లు 2026సెప్టెంబర్27న ప్రకటించారు. నీట్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఆమరణ దీక్ష చేసిన వాంగ్చుక్.. మరోసారి సీజేపీకి మద్ధతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విషయంలో ఇతర కమిషనర్ల అభిప్రాయాలను పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఓట్ల తొలగింపు, అధికార ఎన్డీఏకు లబ్ది చేకూర్చడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 02న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసనకు పిలుపునిచ్చిన సీజేపీకి మద్ధతుగా వాంగ్చుక్ నిలిచారు. సర్ ప్రక్రియలో భాగంగా ఇతర కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలను గత పది నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు తెలిపినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదికలో వెల్లడైంది. ఓటర్ల రిజిస్ట్రేషన్, ఓట్ల తొలగింపు, ఓట్లు చేర్చడం, సర్ మొదలైన అంశాలపై ఎన్నికల సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి జ్ఞానేష్ కుమార్ జవాబుదారీతనాన్ని నిరూపించుకోవాలని సూచించారు.
►ALSO READ | ఫగ్వారా క్యాంపస్‌లో అత్యాచారం కేసు, నిరసనలపై.. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కీలక ప్రకటన
ఆందోళనకు మద్దతు ఇస్తున్నానని, అయితే ప్రతి ఉద్యమంలో వ్యక్తిగతంగా పాల్గొనాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశంలో జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే దేనికైనా కచ్చితంగా మద్దతు ఇస్తాను, ఎల్లప్పుడూ వారితోనే ఉంటానన్నారు. తన దృష్టిలో ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం , ఆ ఉద్యమాలు వాటంతట అవే స్వతంత్రంగా ఉండాలి. ఇవన్నీ స్వతంత్రంగా వచ్చినవే. అది చూసి నేను సంతోషిస్తున్నాను. అందువల్ల, సీఈసీ (CEC) విషయంలో నా అవసరం ఉండదని ఆశిస్తున్నాను,అని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకం అని.. దానిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ దెబ్బతింటే, ప్రజాస్వామ్యానికి ఇంకేం మిగులుతుంది? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలను తప్పక నెరవేర్చాలని అన్నారు.
శాంతియుత నిరసన పద్ధతులు ప్రజా హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీని చాలా పవిత్రమైన రోజుగా అభివర్ణించారు. ఎన్నికల సంఘం నుంచి జవాబుదారీతనం కోరుతూ చేపట్టనున్న ప్రచారంలో భాగంగా, తమ నిరసన అక్టోబర్ 2న ముంబైలో ప్రారంభమవుతుందని సీజేపీ ప్రకటించన విషయం తెలిసిందే.
