జనగామ, వెలుగు: బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జనగామ జిల్లా అగ్రికల్చర్ ఆఫీస్ సామగ్రిని కోర్టు సిబ్బంది జప్తు చేశారు. వివరాల్లోకి వెళ్తే... జనగామలో దీప్తి ఇంజినీరింగ్వర్క్షాప్ నిర్వహిస్తున్న కత్తుల రాజిరెడ్డి తొమ్మిదేండ్ల కింద ట్రాక్టర్లకు సంబంధించిన పరికరాలను వ్యవసాయ శాఖకు సప్లై చేశాడు.
వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో రాజిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు... రాజిరెడ్డికి ఇవ్వాల్సిన అమౌంట్‌తో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ. 18,44,928 అవుతుందని నిర్ణయించి, ఆ డబ్బులకు సరిపడా వ్యవసాయ శాఖ ఆఫీస్ లోని సామగ్రిని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో కోర్టు సిబ్బంది శనివారం కలెక్టరేట్ లోని జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీస్ కు వచ్చి కంప్యూటర్లు, టేబుళ్లను జప్తు చేశారు. కానీ ఆ సామగ్రిని తీసుకెళ్లేందుకు వచ్చిన వాహనాలను.. కలెక్టరేట్ సెక్యూరిటీ సిబ్బంది గేటు బయటే అడ్డుకున్నారు. ఆఫీస్ సమయం ముగిసినందున వాహనాలను లోపలికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. దీంతో కోర్టు సిబ్బంది సామగ్రిని అగ్రికల్చర్ ఆఫీస్ వద్దే వదిలేశారు.
