రెండు సీట్లు.. ఆరుగురి పేర్లు..హైకమాండ్‌‌‌‌కు మూడేసి పేర్లతో పీసీసీ జాబితా

రెండు సీట్లు.. ఆరుగురి పేర్లు..హైకమాండ్‌‌‌‌కు మూడేసి పేర్లతో పీసీసీ జాబితా
  • ఖమ్మం, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 
  • సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు
  • హైకమాండ్‌‌‌‌కు మూడేసి పేర్లతో పీసీసీ జాబితా
  • ఖమ్మం, వరంగల్, నల్గొండ నుంచి 
  • సర్వోత్తమ్ రెడ్డి, పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్
  • హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీశ్​
  • ఈ నెల 29న ఢిల్లీలో ఫైనల్ చేసే అవకాశం

హైదరాబాద్, వెలుగు:నల్గొండ–వరంగల్–ఖమ్మం, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. పీవీ కూతురు వాణీదేవి, నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు సీట్లు మార్చిలో ఖాళీ అవుతుండగా ఆయా స్థానాల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి పలువురు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కో నియోజకవర్గం నుంచి మూడేసి పేర్లను ఫైనల్​ చేసిన పీసీసీ ఆ జాబితాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌‌‌కు శుక్రవారం పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నల్గొండ–వరంగల్–ఖమ్మం నియోజకవర్గానికి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక బాధ్యత మంత్రి దామోదర్​ రాజనర్సింహకు అప్పగించిన సంగతి తెలిసిందే. 


ఈ ఇద్దరు నేతలు అక్కడున్న పరిస్థితులు, సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఒక్కో నియోజకవర్గం నుంచి మూడేసి పేర్లను ఎంపికచేయగా పీసీసీ ఆ జాబితాలనే హైకమాండ్‌‌కు పంపినట్లు సమాచారం. ఈ నెల 29న సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తుండడంతో అదే రోజు రెండు పేర్లను ఫైనల్ చేసే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. నల్గొండ–వరంగల్–ఖమ్మం సీటుకు సూర్యాపేట జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తమ్ రెడ్డి, ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ పేర్లను పీసీసీ సిఫారసు చేసినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్సీగా పోటీకి సర్వోత్తమ్ రెడ్డి ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్‌‌‌‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చనే చర్చ పార్టీలో సాగుతోంది. పీవీ శ్రీనివాస్ ఓసీ, చనగాని దయాకర్ బీసీ.

ఈ ఇద్దరిలో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపనుందనేది ఆసక్తిగా మారింది. బ్రహ్మణ కోటాలో పీవీ శ్రీనివాస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సీటు నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త మన్నె జీవన్ రెడ్డి, పీసీసీ మీడియా కమిటీ మాజీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి, విద్యా సంస్థల చైర్మన్ గౌరీ సతీశ్ పేర్లను హైకమాండ్​కు సిఫార్సు చేశారు. వీరిలో మన్నె జీవన్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే సరైన అభ్యర్థి అని, పోటీ చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఒకవేళ ఆయన పోటీకి నిరాకరిస్తే మిగిలిన ఇద్దరిలో ఒకరి పేరును హైకమాండ్ పరిశీలించే అవకాశం ఉంది. ఈ రెండు సీట్లలో ఒకదానిని రెడ్డికి ఇస్తే ఇంకో సీటును బీసీ పేరు ఖాయమని చెప్తున్నారు.