- 50 వేల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యం : జూపల్లి కృష్ణారావు
- కొత్త వెబ్‌సైట్, హోమ్‌స్టే పోర్టల్.. కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ
- మాదాపూర్ శిల్పారామంలో వరల్డ్టూరిజం డే వేడుకలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యాటక పటంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మాదాపూర్ శిల్పారామంలో ‘ఏఐతో పర్యాటక రంగానికి కొత్త రూపు’ అనే థీమ్‌తో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పర్యాటక రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఆధునిక హంగులతో రీడిజైన్ చేసిన తెలంగాణ టూరిజం వెబ్‌సైట్, ఆన్‌లైన్ హోమ్‌స్టే రిజిస్ట్రేషన్ పోర్టల్, సరికొత్త టూరిజం ట్రైలర్లు, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, పర్యాటక ప్రాంతాలపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు. ‘మై తెలంగాణ.. మై స్టోరీ.. మై డెస్టినేషన్’ వీడియో, పోస్టర్‌తోపాటు ఎకో టూరిజంపై ప్రత్యేక వీడియోలను విడుదల చేశారు. అనంతరం మంత్రి జూపల్లి సమక్షంలో కేంద్ర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర పురావస్తు శాఖల మధ్య చారిత్రక కట్టడాల పరిరక్షణపై అవగాహన ఒప్పందం కుదిరింది.
రూ.50 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం
తెలంగాణను దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టూరిజం పాలసీ అమల్లోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రాష్ట్రానికి రూ.22,174 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశంతో ఇప్పుడు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టడం, 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
పర్యాటక రంగంలో సరికొత్త ప్రయోగంగా ‘రివర్స్ టూరిజం – ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’కు శ్రీకారం చుట్టామని చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలను సందర్శించేందుకు వీలుగా హాప్–ఆన్, హాప్–ఆఫ్ పర్యాటక సేవలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీ – ది ఫ్యూచర్ ఆఫ్ టూరిజం’ అంశంతోపాటు ఎకో, ఫిల్మ్, స్పోర్ట్స్, హెరిటేజ్ టూరిజం అవకాశాలపై నిపుణులతో ప్యానెల్ చర్చ నిర్వహించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు వాణిప్రసాద్, గౌతమి, లక్ష్మణ్ రంజిత్ నాయక్, ఏనుగు నర్సింహారెడ్డి, వెంకటరమణ, బాలాచారి, నిఖిల్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ మార్కెటింగ్‌పై దృష్టి
రాష్ట్రంలో హెల్త్, ఆలయ, గ్రామీణ, ఎకో పర్యాటకానికి అపార అవకాశాలున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వికారాబాద్‌లో వెల్‌నెస్ కేంద్రాల పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలిపారు. ప్రాచీన ఆలయాలు, అడవులు, జలపాతాలు, నగరంలోని చారిత్రక సంపదను గ్లోబల్ వేదికలపై సరైన రీతిలో మార్కెటింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బడ్జెట్‌లో పర్యాటక రంగానికి పెద్దపీట వేశామని చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించి పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. ఐటీ ఉద్యోగులకు టూరిజం కూపన్లు అందించి వీకెండ్స్‌లో తెలంగాణ అందాలను చూసేలా ప్రోత్సహించాలని చెప్పారు
