- ఈ స్కీమ్‌తో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నయ్
- మెదక్‌లో కొత్తగా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం
మెదక్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు, హాజరు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పోషకాలతో కూడిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని ఉపాధి, కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికరమైన అల్పాహారం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 36 సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచన్ లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ ల ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్న పథకం ప్రపంచంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో కొత్తగా నిర్మించిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.
కేంద్రీకృత కిచెన్ లోని ఆధునిక యంత్రాలను, వాటి ద్వారా వివిధ రకాల అల్పాహారాలు తయారు చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షనల్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంత్రి స్వయంగా అల్పాహారం వడ్డించి , విద్యార్థులతో పాటు కలిసి అల్ఫారాన్ని తిన్నారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు.
బీఆర్ఎస్ హామీ ఇచ్చి విస్మరించింది..
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివేక్తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం అమలు కోసం హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ ఎంతో సహకారం అందిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదన్నారు.
ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే 10 వేల టీచర్స్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ , తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాగే, ప్రతి సెగ్మెంట్ కు ఒక ఏటీసీని ఏర్పాటు చేస్తున్నామని, అందులో చదువుకుంటున్న వారికి స్టైపెండ్ ఇస్తుండటం దేశంలో ఎక్కడా లేదని మంత్రి చెప్పారు. విదేశాల్లో ఉద్యోగాల కల్పన కోసం జర్మన్ లాంగ్వేజ్నేర్పిస్తుండటం, కొత్త కరిక్యులమ్ అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాగు పద్ధతులతో అధిక పంట దిగుబడులు సాధించాలని మంత్రి వివేక్ వెంకట స్వామి రైతులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, అధిక దిగుబడులు సాధించే విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు శనివారం మెదక్ లో ఏర్పాటు కిసాన్ మేళాను మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, నీటి పొదుపు పద్ధతులు, యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడంతో పాటు, పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మెదక్ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పేద విద్యార్థులకు వరం: ఎమ్మెల్యే రోహిత్ రావు
ముఖ్యమంత్రి అల్పాహార పథకం వేలాది మంది పేద విద్యార్థులకు వరమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. నాణ్యమైన, పౌష్టికాహారం అందించడం గొప్ప విషయమన్నారు. రామాయంపేటలో రూ.200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటవుతుందని తెలిపారు.
హరే కృష్ణ మూవ్మెంట్చారిటబుల్ ట్రస్ట్ ఏపీ, తెలంగాణ రీజియన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస మాట్లాడుతూ.. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే పథకంలో తమను భాగస్వాములను చేయడం సంతోషకరమన్నారు. మెదక్ కిచెన్ ద్వారా జిల్లాలో 30 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ కే ఎం సీఈఓ కౌంతేయదాస ప్రభుజి, పీఆర్ ఇన్చార్జి రవిలోచన దాస ప్రభుజి , మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
