- ఆపరేటర్లు, మెషీన్లు పనిచేయడం లేదంటూ సాకులు
- పట్టించుకోని అధికారులు..లైట్ తీసుకుంటున్న వ్యాపారులు
ఖమ్మం/ కొణిజర్ల, వెలుగు: పెట్రోల్ బంకుల్లో వ్యాపారంపై శ్రద్ధ చూపిస్తున్న వ్యాపారులు.. వినియోగదారులకు తప్పనిసరిగా కల్పించాల్సిన సౌకర్యాలను కల్పించడం లేదు. వాహనాలకు ఉచిత గాలి, వినియోగదారులకు తాగునీరు, పురుషులు, మహిళలకు వేర్వేరుగా పరిశుభ్రమైన టాయిలెట్లు వంటి వసతుల కల్పనను పట్టించుకోవడం లేదు. కొత్తగా ఏర్పాటవుతున్న బంకులను కొన్నాళ్ల పాటు బాగానే నడిపిస్తున్నా.. ఇప్పటికే పట్టణాలు, నగరాల్లో చాలా ఏళ్లుగా కొనసాగుతున్న బంకుల్లో సౌకర్యాల కొరత కనిపిస్తోంది.
వినియోగదారులు ప్రశ్నిస్తున్నా, తగిన సిబ్బంది లేరని, ఆపరేటర్ లేడని, మెషీన్ పని చేయడం లేదని.. ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. కొన్ని బంకుల్లో ఏళ్ల తరబడి ఇదే సమాధానం చెబుతున్నా.. వాటిని తనిఖీ చేయాల్సిన ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో బంకు ఓనర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
నిబంధనలు పాటించట్లే..
ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి బంకులో తప్పనిసరిగా ఉచితంగా గాలి, తాగునీటితో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలు, ఫిర్యాదుల రిజిస్టర్, హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలి. పెట్రోల్ లేదా డీజిల్ క్వాలిటీని తనిఖీ చేసేందుకు లిట్మస్ పేపర్, క్వాంటిటీ చెక్ చేసేందుకు అవసరమైన సామగ్రి అందించాల్సి ఉంటుంది. వినియోగదారుల ఫిర్యాదుల కోసం సంబంధిత ఆయిల్ కంపెనీ అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు ప్రదర్శించాల్సి ఉంటుంది.
సివిల్ సప్లై అధికారులు, తూనికలు, కొలతల శాఖ అధికారులు బంకులను రెగ్యులర్ గా తనిఖీలు చేస్తూ, నిబంధనలను పాటించని వారికి హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘనల తీవ్రతను బట్టి జరిమానా విధించడం, లైసెన్స్ రద్దు చేయడం వంటి కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, అలా బంకులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
బంకులు బాధ్యత..
ఫ్యూయల్ కొనుగోలు చేసే వినియోగదారులకు సదుపాయాలు కల్పించడం బంకు నిర్వాహకులు దయతో చేస్తున్న సేవలు కావు. సంబంధిత సంస్థ మార్గదర్శకాల్లో డీలర్ అందించాల్సిన కనీస సేవలుగా వీటిని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధర నిర్ణయించే సమయంలోనే ఈ సేవలకు సంబంధించిన మార్జిన్ కూడా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్లో వివరాలు చూపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 270 పెట్రోల్ బంకులు ఉండగా, సగానికి పైగా బంకుల్లో కనీస సౌలతులు కల్పించడం లేదనే విమర్శలున్నాయి.
అధికారులు చర్యలు తీసుకోవాలి
కొణిజర్లలోని బీబీసీ కెనాల్ సమీపంలోని బంకులో చాలా రోజులుగా కనీస సౌలతులు కల్పించడం లేదు. టైర్లలో గాలి తగ్గితే ఇబ్బంది పడుతున్నాం. ఆపరేటర్ లేడు, మెషీన్ పని చేయడం లేదని చెబుతున్నారు. దీంతో బయట గాలి పెట్టించుకోవాల్సి వస్తోంది. వినియోగదారుల సౌకర్యాలను పట్టించుకోని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
- భూక్యా సుమన్, కొణిజర్ల
