- 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోయాల్సి ఉన్నా..
- ప్రస్తుతం 800 క్యూసెక్కులు లిఫ్టింగ్
- ఈ సీజన్లో వాడుకున్నది 10 టీఎంసీలే..
నాగర్‌కర్నూల్, వెలుగు: శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కరెంట్ కోతల కారణంగా నిరుపయోగంగా మారుతోంది. స్కీమ్ పరిధిలోని రెండు పంపులు పనికి రాకుండా పోగా, మిగిలిన మూడు పంపులు నడిపితే రోజుకు 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకోవచ్చు.
కానీ కరెంట్ కోతల వల్ల అతి కష్టం మీద రోజుకు 800 క్యూసెక్కుల నీటిని మాత్రమే లిఫ్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ లో ఇప్పటివరకు కేవలం 10 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోయగలిగారు. ఫలితంగా ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
4 వేల క్యూసెక్కులు ఎత్తిపోయాల్సి ఉన్నా...
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో 4.53 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. కేఎల్ఐ పరిధిలోని మూడు లిఫ్టులలో ఐదు పంపుల చొప్పున ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. కానీ ప్రధాన కాల్వల నిర్మాణంలో లోపాల కారణంగా 2,400 క్యూసెక్కులకు మించి ఎత్తి పోసే అవకాశం లేదు.
మరో వైపు 2020 అక్టోబర్లో ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ప్రమాదం జరగడంతో రెండు పంపులు దెబ్బతిన్నాయి. వాటిని అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం నుంచి ఇప్పటి కాంగ్రెస్ వరకు ఎవరూ పట్టించుకోలేదు. అలాగే 2021 నుంచి జొన్నలబొగడ పంప్‌హౌజ్‌లోని ఓ పంప్ మూలకు పడింది. ఈ క్రమంలో 2020 నుంచి మూడు లిఫ్ట్ ల పరిధిలో ఒక్కో పంప్ చొప్పున మూడింటిని మాత్రమే నడిపిస్తున్నారు.
కరెంట్ కోతలతో నడవని మోటార్లు
వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ సరఫరాను 12 గంటలకు కుదించినప్పటికీ.. ఎల్ సీ, ఇతర కారణాలతో 8 గంటలకు మించి మోటార్లు నడవడం లేదని రైతులు వాపోతున్నారు. మరో వైపు ట్రాన్స్‌కో సబ్స్టేషన్ల ద్వారా కేఎల్ఐ లిఫ్ట్ లకు విద్యుత్ సరఫరా అందకపోవడంతో లిఫ్ట్ లు 6 నుంచి 8 గంటలకు మించి నడిపే పరిస్థితి లేకుండా పోతోంది.
మూడు లిఫ్ట్ లలో మూడు పంపులు రెగ్యులర్‌గా నడిచి 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తేనే రిజర్వాయర్ల హెడ్ రెగ్యులేటర్ల నుంచి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. కనీసం రెండు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటే తప్ప నీరు ముందుకు సాగడం సాధ్యపడదని ఇంజినీర్లు అంటున్నారు.
ఇప్పటివరకు లిఫ్ట్ చేసింది 10 టీఎంసీలే..
కృష్ణానదికి వరద ప్రారంభం కాగానే కేఎల్ఐ పంపులను స్టార్ట్ చేసి ఎల్లూరు, సింగోటం, జొన్నల బొగడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లతో పాటు 650 నోటిఫైడ్ చెరువులను నింపాల్సి ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోలేదు. నదికి జులైలోనే వరద మొదలైనప్పటికీ ఆఫీసర్లు మాత్రం ఆగస్ట్మొదటి వారంలో కల్వకుర్తి పంపులను స్టార్ట్ చేశారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు కేవలం 10 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తి పోశారు.
ఈ నీటినే ఓ వైపు పంటల సాగుకు, మరోవైపు మిషన్ భగీరథకు వాడుతున్నారు. దీంతో కనీసం 70 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. కేఎల్ఐ పంపులను బంద్ పెట్టాలని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ట్రాన్స్‌కో సబ్స్టేషన్లకు ఆదేశాలు వస్తున్నాయని ఇంజినీర్లు వాపోతున్నారు.
చివరి ఆయకట్టుకు అందని నీరు
కేఎల్ఐ ప్యాకేజీ 29లో గుడిపల్లిగట్టు రిజర్వాయర్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న డీ 82 కింద 60 వేల ఎకరాలకు నీరు అందాలంటే 2,100 క్యూసెక్కుల వెలాసిటీ అవసరం కాగా కాల్వలో అక్కడక్కడ మాత్రమే నీరు కనిపిస్తోంది. మొదటి లిఫ్ట్ ఎల్లూరు నుంచి ఎత్తిపోసే నీటిని 28, 29, 30 ప్యాకేజీల మెయిన్ కెనాల్స్ ద్వారా నీటిని వదలాల్సి ఉంది.
కానీ మెయిన్ కెనాల్స్ పై రైతులు ఏర్పాటు చేసుకున్న దాదాపు 40 వేల మోటార్ల ద్వారా నీటిని ఎక్కడికక్కడే లాగేస్తుండడంతో చివరకి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ప్యాకేజీ 30లోని చివరి ఆయకట్టుకు ఈ వానాకాలంలో సాగునీరు అందడం గగనమే అని రైతులు వాపోతున్నారు.
