- కమిషన్‌లో విభేదాల్లేవని సీఈసీ క్లారిటీ
- ఏకాభిప్రాయంతోనే కీలక నిర్ణయాలు
- నిర్వాచన్ సదన్‌లో కమిషనర్ల భేటీ
- మీడియాకు సంయుక్త ప్రకటన
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఇకపై ఆందోళన చెందనక్కర్లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. విచారణ కోసం ఎక్కడికీ వెళ్లనక్కర్లేదని, సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో) లే ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లను పరిశీలించి, వారే అప్‌లోడ్ చేస్తారని ఈసీ తెలిపింది. అత్యవసరమైతేనే ఓటర్లను విచారణకు పిలుస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ శనివారం క్లారిటీ ఇచ్చారు.
సర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతుండడం, ఎలక్షన్ కమిషన్‌లో విభేదాలంటూ ప్రచారం జరగడంతో శనివారం మధ్యాహ్నం నిర్వాచన్ సదన్‌లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో ఎలక్షన్ కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీ సమావేశమయ్యారు. కమిషన్ అంతర్గత వ్యవహారాలు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు సంబంధించి ఎదురవుతున్న సందేహాలు, మీడియా కథనాలపై పాయింట్లవారీగా సమగ్ర వివరణ విడుదల చేస్తూ సంయుక్త ప్రకటన జారీ చేసింది.
ఎన్నికల సంఘం నిర్ణయాలన్నీ పూర్తి ఏకాభిప్రాయంతో, ఏకగ్రీవంగానే తీసుకున్నామని కమిషన్ స్పష్టం చేసింది. అంతర్గత భిన్నాభిప్రాయాలు, చర్చలు సంస్థాగత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేనని, నిర్ణయాల అమల్లో ఎలాంటి విభేదాల్లేవని స్పష్టంచేసింది. ఇటీవల ‘సర్’, ఫామ్-6 నిబంధనలు, ఐటీ పోర్టల్ ‘ఈసీఐనెట్’ నిర్వహణ, ఐటీ విభాగంలో అధికారుల బాధ్యతల కేటాయింపు తదితర అంశాలపై ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పూర్తి కమిషన్ సమావేశమై వివాదానికి ముగింపు పలికే యత్నం చేసింది.
ఫామ్-6 డిక్లరేషన్‌పై వివరణ..
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి కోసం ఫామ్-6కు అనుసంధానించిన డిక్లరేషన్‌పై అభ్యంతరాలు వచ్చాయి. దీనిపై ఈసీ స్పందిస్తూ.. తల్లిదండ్రుల వివరాలను పాత ‘సర్’ డేటాతో మ్యాపింగ్ చేయాలన్న ఈ నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపింది. ‘సర్’ వెలుపల జరిగే సాధారణ సమయాల్లో 1960 ఎలక్టర్స్ రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారమే ఫారాలు ఉంటాయని స్పష్టం చేసింది.
‘ఈసీఐనెట్’ పోర్టల్ వినియోగంపై వచ్చిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నట్టు కమిషన్ తెలిపింది. క్షేత్రస్థాయి అధికారులకు చట్టబద్ధమైన అధికారాల మేరకే లాగిన్ అనుమతులు ఉంటాయని పేర్కొన్నది. పోర్టల్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలో ఐఐటీ లేదా ట్రిపుల్ ఐటీ నిపుణుడితో కూడిన కమిటీ ద్వారా టెక్నికల్ రివ్యూ చేపడతామని ప్రకటించింది.
కేబినెట్ సెక్రటరీకి వెళ్లిన లేఖ కమిషన్ విధానాలకుగానీ, ఐటీ విభాగానికిగానీ సంబంధించింది కాదని.. డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఒక నిర్దిష్ట అధికారి తీరుకు సంబంధించి మాత్రమేనని తెలిపింది. కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన పని విభజన ఉత్తర్వులను ఇప్పటికే నిలిపివేశామని వివరించింది. గోవాలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 97 మంది ఓటర్ల విషయంలో బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌వో) ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి విచారణ జరిపారని తెలిపింది. వీరిలో 81 మందిని ఫామ్- 6 ద్వారా తిరిగి నమోదు చేసినట్టు ఈసీ వెల్లడించింది.
కీలక సంస్కరణలు..
కమిషన్ రోజువారీ పనితీరులో పారదర్శకతను పెంచేందుకు పలు కీలక సంస్కరణలను అమలు చేయనున్నట్టు ఈసీ వెల్లడించింది. ‘‘కమిషన్ సమావేశాలకు సంబంధించిన అజెండాను ముందుగానే సభ్యులందరికీ పంపుతారు. భేటీ ముగిసిన వెంటనే అధికారికంగా మినట్స్ నమోదు చేస్తారు. ఎలక్షన్ కమిషనర్లు ఇచ్చే ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాల్సిందే’’ అని తేల్చిచెప్పింది.
