రష్యా చమురు రాకుంటే తిప్పలే.. ఏటా రూ.34 వేల కోట్ల వరకు లాస్

రష్యా చమురు రాకుంటే తిప్పలే.. ఏటా రూ.34 వేల కోట్ల వరకు లాస్
  • ఆ దేశం నుంచి రోజుకు 19 లక్షల బ్యారెళ్ల క్రూడ్​
  • ఇతర దేశాల నుంచి ఇంత భారీగా కొనడం కష్టమే

న్యూఢిల్లీ: అమెరికా వంద శాతం సుంకాలకు భయపడి కేంద్రం రష్యా నుంచి చవక చమురు దిగుమతులను ఆపేస్తే ఖజానాకు చిల్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాకు బదులుగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.34 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని ఫైనాన్షియల్ ఎక్స్‌‌‌‌ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. ఇతర దేశాల నుంచి క్రూడాయిల్ ​కొంటే బ్యారెల్‌‌‌‌కు 5 నుంచి 10 డాలర్లు ఎక్కువ  చెల్లించాల్సి ఉంటుంది. 

రోజుకు 20 లక్షల బ్యారెల్స్ ​కొంటే ఈ మొత్తం రెట్టింపు అవుతుందని యూఏఈకి చెందిన కమోడిటీ అనలిస్ట్ నటాలియా కటోనా తెలిపారు. అంత పెద్ద మొత్తంలో చమురును ఒక్కసారిగా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సాధ్యం కాదు. ఈ ఏడాది ఆగస్టులో రష్యా నుంచి రోజుకు దాదాపు 19 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి అయింది. 

ఇది మొత్తం దిగుమతుల్లో సుమారు 42 శాతం. ఇంధన భద్రతకు జాతీయ ప్రయోజనాలకు భారత్ పెద్దపీట వేస్తున్నందున రష్యన్ చమురును పూర్తిగా నిలిపివేయకపోవచ్చని భావిస్తున్నారు. మిగతా చమురును గయానా, నైజీరియా, అమెరికా, బ్రెజిల్ లేదా పశ్చిమాసియా దేశాల నుంచి కొనుగోలు చేయడం ద్వారా సరఫరాను రకరకాల దేశాల నుంచి సర్దుబాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 

పెరగనున్న డిమాండ్​

మనదేశంలో ఏటా అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇంధన డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ కాలంలో ముడి చమురు అవసరాలు పెరుగుతాయి. రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తాయి కాబట్టి దిగుమతులను తగ్గించుకోవడం కష్టమే. రష్యన్ చమురు మరీ చౌక కాకపోయినప్పటికీ, ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తోంది. జులైలో భారతదేశ దిగుమతుల్లో రష్యా వాటా సుమారు 52 శాతంగా ఉందని రేటింగ్​ఏజెన్సీ ఇక్రా ఎనలిస్ట్​ ప్రశాంత్ వశిష్ట్ తెలిపారు. 

టారిఫ్  ముప్పు కారణంగా భారత్ ఇంధన కొరతను ఎదుర్కొనే సాహసం చేయదని, ఇటువంటి పెద్ద మొత్తాలను వేరే దేశాల నుంచి భర్తీ చేయడం  కష్టమని ఆయన చెప్పారు. గయానా, నైజీరియా, అమెరికా, బ్రెజిల్ నుంచి అదనపు సరఫరాలను కోరినప్పటికీ కావలసినంత సరఫరా కావడం సాధ్యం కాకపోవచ్చు. 

ఇదే జరిగితే డిమాండ్​ను తట్టుకోవడం కష్టమవుతుంది. గల్ఫ్​ దేశాలు తక్కువ దూరంలో ఉండటం వల్ల అవి సహజ  ప్రత్యామ్నాయాలు అవుతాయి. అయినప్పటికీ అక్కడి నుంచి సరఫరాలు పరిమితంగానే ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ పైప్‌‌‌‌లైన్  తిరిగి ప్రారంభమైనప్పటికీ యాన్బు వద్ద లోడింగ్‌‌‌‌లు ప్రారంభం కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.