కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా?

కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా?
  • భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం
  • అక్టోబర్​ 1న తెలంగాణ కేబినెట్​ భేటీ
  • ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడే చాన్స్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు 21వ సర్వసభ్య సమావేశం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 1న హైదరాబాద్‌‌లోని జలసౌధలో రెండు రాష్ట్రాల ఈఎన్‌‌సీలు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలని కేఆర్‌‌ఎంబీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల అధికారులు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పునరావాస, రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో తాము సమావేశానికి రాలేమని, మరో తేదీకి వాయిదా వేయాలని కోరే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అక్టోబర్ 1వ తేదీనే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ కూడా జరగనుంది. దీంతో రాష్ట్ర సాగునీటి శాఖ ఉన్నతాధికారులు కేబినెట్ పనుల్లో బిజీగా ఉండాల్సి వస్తుంది. ఈ రెండు కారణాలతో మరో తేదీని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలంటున్నాయి. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందని చెబుతున్నాయి.  

త్రీమెంబర్ కమిటీ ఎజెండానే బోర్డు ముందుకు..

బోర్డు పరిధిలోని వివాదాలపై గతంలో నిర్వహించిన త్రీమెంబర్ కమిటీ భేటీల ఎజెండానే ఈ 21వ పూర్తిస్థాయి బోర్డు మీటింగ్‌‌లోనూ ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ‘‘ప్రస్తుత నీటి సంవత్సరానికి (2026–27) సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య తాగు, సాగునీటి కేటాయింపుల వాటా తేల్చడం. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ అక్రమ తరలింపుల నియంత్రణ. టెలిమెట్రీ పరికరాలు, క్యారీ ఓవర్​ వాటా లెక్కింపు” వంటి అంశాలపైనే తెలంగాణ డిమాండ్​ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, ఆగస్టు 24, సెప్టెంబర్​ 4న జరిగిన త్రీమెంబర్​ కమిటీ మీటింగులు ఏమీ తేల్చకుండానే ముగిశాయి. 66:34 నిష్పత్తిలోనే నీటి వాటాలు పంచాలని ఏపీ వాదించగా.. క్యాచ్​మెంట్​ ప్రకారం తమకే ఎక్కువ వాటా వస్తుందని, ఎల్​నినో నేపథ్యంలో 50:50 వాటా పంచాలని తెలంగాణ తేల్చి చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బోర్డు మీటింగ్​నిర్వహించాలని సెప్టెంబర్​ 4 నాటి త్రీమెంబర్​ కమిటీ మీటింగ్​లో నిర్ణయించారు.