గొర్రె, మేకకు రూ. 13కే ఇన్సూరెన్స్.. మిగితా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది: మంత్రి వాకిటి శ్రీహరి

గొర్రె, మేకకు రూ. 13కే ఇన్సూరెన్స్.. మిగితా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది: మంత్రి వాకిటి శ్రీహరి
  • కులవృత్తిదారుల కోసం అనేక పథకాలు: మంత్రి వాకిటి శ్రీహరి
  • వచ్చే నెల నుంచి ఇందిరమ్మ బీమా పథకం: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుగు: గొర్రెల స్కీమ్ పేరిట గత సర్కార్ హయాంలో అవినీతికి పాల్పడ్డారని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. గొల్ల, కురుమల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మేకకు గానీ, గొర్రెకు గానీ రూ. 13 చెల్లించి ఇన్సూరెన్స్ చేయించుకుంటే మిగితా సొమ్మును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

గొర్రెల పెంపకందారుల సహకార సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాషవేణి మల్లేశ్ యాదవ్ అధ్యక్షతన శనివారం స్థానికంగా నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా గొర్రెలు, మేకల బీమాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల వృత్తిదారులను ప్రోత్సహిస్తోందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. గొర్రెలతో పాటు పెంపకందారులకు సైతం బీమా కల్పించేలా చూస్తామన్నారు. గొల్లకురుమలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, తర్వాతి తరం మరింత అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని సూచించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కులవృత్తి దారులందరికీ 55 ఏండ్లకే పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఇందిరమ్మ బీమా పథకంలో భాగంగా ప్రజలందరికీ రూ.5 లక్షల బీమా కల్పించేందుకు కేబినెట్ ఆమోదించిందని, వచ్చే నెల నుంచి ఈ స్కీమ్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, యాదవ, కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, పశుగణన అభివృద్ధి చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, పశుసంవర్ధక శాఖ ఎండీ సుబ్బారాయుడు, జేడీ.లింగారెడ్డి, మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సన్న పాల్గొన్నారు.