హైదరాబాద్, వెలుగు: అపరిశుభ్రత, ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న హైదరాబాద్ ఐటీ కారిడార్ లోని 11 ప్రముఖ రెస్టారెంట్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను ఫుడ్ సేఫ్టీ అధికారులు రద్దు చేశారు. తక్షణమే ఆయా రెస్టారెంట్ల వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. శనివారం తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (టీజీ సేఫ్) ఎన్ ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన 10 స్పెషల్ టీమ్స్ పోలీసులతో కలిసి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని మొత్తం 20 హోటళ్లలో సోదాలు నిర్వహించాయి.
హైటెక్ సిటీలోని మొనాస్టరీ, కోల్ స్పార్క్, కంచీ కేఫ్, గచ్చిబౌలిలోని శివాని రెస్టారెంట్ అండ్ బార్, అల్ సబా, ఉడుపి ఉపహార్, అంతేరా కిచెన్ అండ్ బార్, మాదాపూర్ లోని లక్కీ మల్టీక్విజిన్ రెస్టారెంట్, సాయిరామ్ మెస్ అలాగే ఇనార్బిట్ మాల్ లోని అమ్ ఆహా తెలుగు కిచెన్, ఫ్యూజన్ 9 , అమ్నేషియా స్కై బార్ ల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు.మరోవైపు ఉల్లంఘనలకు సంబంధించి పెనాల్టీలు విధించేందుకు హైటెక్ సిటీలోని హోటల్ ఆవాసా, కొండాపూర్ లోని మినర్వా గ్రాండ్ (సెలెస్ట్ హాస్పిటాలిటీ), గచ్చిబౌలిలోని 63 డిగ్రీస్ రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులిచ్చారు. చాలాచోట్ల డ్రైనేజీ సమస్యలు, సిబ్బంది గుట్కా నమలడం, పచ్చి మాంసం-వండిన ఆహారం కలిపి నిల్వ చేయడం గుర్తించి కల్తీ అనుమానంతో 21 శాంపిళ్లను ల్యాబ్ కు తరలించారు.
