తెలుగులో ‘విజ్ఞాన్‌‌ వెలుగు’ సైన్స్‌‌ మ్యాగజైన్..5 భాషల్లో మ్యాగజైన్లు ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

తెలుగులో ‘విజ్ఞాన్‌‌ వెలుగు’ సైన్స్‌‌ మ్యాగజైన్..5 భాషల్లో మ్యాగజైన్లు ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలుగులో 'విజ్ఞాన్ వెలుగు' పేరుతో ఇకపై పాపులర్ సైన్స్ మ్యాగజైన్ అందుబాటులోకి రానుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎస్‌‌ఐఆర్‌‌) 85వ ఫౌండేషన్ డే సందర్బంగా శనివారం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌‌ జితేంద్ర సింగ్‌‌ 5 భారతీయ భాషల్లో కొత్త పాపులర్‌‌ సైన్స్‌‌ మ్యాగజైన్లను ఆవిష్కరించారు. తెలుగుతో పాటు తమిళం(అరివియల్‌‌ అరిక్కైయాలర్‌‌), మరాఠీ(విజ్ఞాన్‌‌ క్షితిజ్‌‌), బెంగాలీ(బిగ్యాన్‌‌ బృత్తాంతో), అస్సామీ(బిగ్యాన్‌‌ లహర్‌‌) పేర్లతో ఇవి ప్రజల ముందుకు రానున్నాయి.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. శాస్త్రీయ సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రజలకు చేరువ చేసేందుకే ఈ మ్యాగజైన్లు తెచ్చామన్నారు. ఎంపిక చేసిన కథనాలను ఏఐ సాయంతో అనువదించిన అనంతరం మానవ నిపుణులు ప్రూఫ్‌‌ రీడింగ్, వాస్తవ నిర్ధారణ, సంపాదకీయ సవరణలు చేపడతారని తెలిపారు. అనువాదాలతో పాటు ఆయా భాషల్లో స్వతంత్ర శాస్త్రీయ వ్యాసాలు కూడా ప్రచురించనున్నట్లు చెప్పారు.