- గణేశ్ ఉత్సవాల సందర్భంగా అదనంగా 4,527 మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నిమజ్జనం సందర్భంగా వెలువడ్డ వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఉత్సవాలు జరిగిన 12 రోజులపాటు 4,527 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అదనంగా సేకరించినట్లు అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలించేందుకు 136 టీమ్స్, 6 వేల మంది సిబ్బందిని ప్రత్యేకంగా నిమయించారు. నిమజ్జనం జరిగిన ఆయా ప్రాంతాల్లో పేపర్ షాట్లను తొలగించేందుకు కార్మికులు ఎంతో శ్రమించారు. ఎంత ఊడ్చినా గాల్లోకి లేవడంతో కొన్నిచోట్ల నీటితో క్లీన్ చేశారు. శుక్రవారం, శనివారం జీహెచ్ఎంసీ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆదివారం సాయంత్రానికి వ్యర్థాలను పూర్తిగా తొలగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సీఎంసీలో పూల వ్యర్థాల సేకరణ..
సీఎంసీ(సైబరాబాద్మున్సిపల్కార్పొరేషన్)లో గత 11 రోజుల్లో సుమారు 6 వేల కిలోల పూల వ్యర్థాలను సేకరించారు. మిగిలిన విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యేవరకు నిమజ్జన కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు, పూల వ్యర్థాల సేకరణను కొనసాగించనున్నట్లు సీఎంసీ అధికారులు తెలిపారు.
హుస్సేన్ సాగర్ లో వ్యర్థాల తొలగింపు షురూ..
హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం తర్వాత వ్యర్థాలను హెచ్ఎండీఏ అధికారులు తొలగిస్తున్నారు. విగ్రహాలకు సంబంధించిన డెబ్రిస్ వెలికితీసి లోయర్ ట్యాంక్ బండ్ లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్ ఫర్ స్టేషన్ కి పంపుతున్నారు. శుక్రవారానికి ముందే 2 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగించారు. సాగర్ లో ఇంకా 8 వేల మెట్రిక్ టన్నుల డెబ్రిస్ వస్తుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 30 టిప్పర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లో మొత్తం వ్యర్థాలను తొలగించనున్నట్లు తెలిపారు.
