కోరుట్ల, వెలుగు: అంగన్ వాడీ టీచర్ల నుంచి లంచం తీసుకున్న జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీవో దారోజు పద్మను ఏసీబీ ఆఫీసర్లు శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ గొర్రె మధు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి అర్బన్ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాల తనిఖీ సందర్భంగా వ్యతిరేకంగా రిపోర్ట్ లేకుండా చూసుకునేందుకు సీడీపీవో దారోజు పద్మ లంచం డిమాండ్ చేశారు.
మొత్తం 21 కేంద్రాల నుంచి నెలకు రూ. వెయ్యి చొప్పున మూడు నెలలకు సంబంధించి రూ. 63 వేలు ఇవ్వాలని చెప్పారు. దీంతో అంగన్ వాడీ కేంద్రాల నిర్వాహకులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు శనివారం సీడీపీవోను కలిసి డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు సీడీపీవోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
