టీజీ టెట్లో 30% మంది టీచర్లు ఫెయిల్.. 15,749 మంది ఉపాధ్యాయులు క్వాలిఫై

టీజీ టెట్లో 30% మంది టీచర్లు ఫెయిల్.. 15,749 మంది ఉపాధ్యాయులు క్వాలిఫై
  • పేపర్ 1లో 68.76%, పేపర్ 2లో 70.3%  ఓకే
  • ఫలితాలు విడుదల చేసిన టెట్ చైర్మన్

హైదరాబాద్, వెలుగు: ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రభు త్వం నిర్వహించిన టీజీ టెట్‌‌లో 30 శాతం మంది ఫెయిల్ అయ్యారు. పరీక్ష రాసిన వారిలో15,749 (70.07 శాతం) మంది ఉపాధ్యాయులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరె క్టరేట్ ఆఫీసులో ఇన్‌‌ సర్వీస్ టీజీ టెట్ ఫలితాలను టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు. ఈ నెల 8,9 తేదీల్లో మూడు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్షకు మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 22,477 మంది హాజరయ్యారు. వీరిలో 70.07% మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌‌–1 పరీక్ష ను తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ భాషల్లో 
నిర్వహించారు. ఈ పేపర్‌‌కు 5,964 మంది దరఖాస్తు చేసుకోగా 4,942 మంది హాజరయ్యారు. వీరిలో 3,398 మంది (68.76 శాతం) క్వాలిఫై అయ్యారు.  

పేపర్‌‌–2లో మ్యాథమెటిక్స్‌‌ అండ్‌‌ సైన్స్‌‌ (ఎం అండ్‌‌ ఎస్‌‌సీ) పరీక్షకు10 వేల మంది దరఖాస్తు చేసుకోగా 9,131 మంది హాజరయ్యారు.  6,720 మంది ఉత్తీర్ణులయ్యారు. సోషల్‌‌ స్టడీస్‌‌ పరీక్షకు 9,022 మంది దరఖాస్తు చేసుకోగా 8,404 మంది పరీక్ష రాశారు. వీరిలో 5,631 మంది క్వాలిఫై అయ్యారు. మొత్తంగా పేపర్‌‌‌‌ 1లో 68.76% మంది, పేపర్ 2లో 70.3% మంది ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌‌సైట్ ద్వారా ఫలితాలను డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీసేవ కేంద్రాల ద్వారా కూడా స్టేట్‌‌మెంట్ ఆఫ్ మార్క్స్‌‌ను పొందవచ్చని అధికారులు సూచించారు. కాగా, సర్వీసులో ఉన్న టీచర్ల కోసం ప్రభుత్వం రెండో స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌‌ను అక్టోబర్1న విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ గాజర్ల రమేశ్ తెలిపారు.  నవంబర్16 నుంచి 21 వరకు ఆన్‌‌లైన్‌‌లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏటా నిర్వహించే రెండు రెగ్యు లర్ టెట్‌‌లతో పాటు, సర్వీసులో ఉన్న టీచర్ల కోసం అదనంగా రెండు స్పెషల్ టెట్లు నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. నవంబర్‌‌‌‌లో జరిగే టెట్ పరీక్షతో స్పెషల్ టెట్ ప్రక్రియ పూర్తికానున్నది.