- పదేండ్ల వరకు సోషల్ మీడియాలోనే గులాబీ పార్టీ
- మా పార్టీకి ఒక బస్సు కొని ‘భైరవ’ అనే పేరు పెడ్తం
- పవన్ కల్యాణ్ కావాలనే ట్రోల్ చేస్తుండు: టీఆర్ఎస్ చీఫ్ కవిత
హైదరాబాద్, వెలుగు: గణేశ్ నిమజ్జనాల్లో బీఆర్ఎస్ నేతలు డబ్బులిచ్చి కేసీఆర్ పాటలకు డ్యాన్సులు చేయించారని టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అవన్నీ గులాబీ పార్టీ పెయిడ్ టీంల డ్యాన్సులని ఎద్దేవా చేశారు. పదేండ్లపాటు బీఆర్ఎస్ సోషల్‌మీడియాలోనే బతకాల్సిందేనని వ్యాఖ్యానించారు. శనివారం బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్ ఆఫీసులో కవిత మీడియాతో మాట్లాడారు. అనంతరం చిట్‌చాట్ చేశారు.
రేవంత్ అట్టర్‌ఫ్లాప్ సీఎం అని అన్నారు. తాము సమస్యపై మాట్లాడితేనే ప్రభుత్వం స్పందిస్తున్నదని చెప్పారు. టీఆర్ఎస్ కొడంగల్సభ సక్సెస్ అయిందని తెలిపారు. ఈ సభకు బస్సును రెంట్ తీసుకున్నామన్నారు. అయితే, త్వరలోనే ఓ బస్సు కొంటామని, ప్రత్యేకంగా రెడీ చేయిస్తున్నామని, దానికి ‘భైరవ’ అనే పేరు పెడదామనుకుంటున్నామని తెలిపారు.
ఎండాకాలంలో పాదయాత్ర చేస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ టీం కావాలనే తనను ట్రోల్ చేస్తున్నదని, వాళ్లను లైట్ తీసుకున్నానని తెలిపారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ మాట్లాడితే.. తాను ఆయన గురించి మాట్లాడతానని అన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికతోపాటు గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని వెల్లడించారు.
పసికందులు చనిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది?
రేవంత్ రెడ్డిది చేతకాని.. అసమర్థ ప్రభుత్వమని కవిత విమర్శించారు. ఈ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో ఏటా 4 వేల మంది చిన్నారులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఆధునిక కాలంలో ఏటా వేలాది పసికందులు చనిపోతుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో పసికందుల మరణాల తర్వాత ఓ మిత్రుడు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో డేటాతో సహా తనకు పంపించారని చెప్పారు. ఆ డేటా చూసిన తర్వాత రెండు రోజులపాటు నిద్ర పట్టలేదని, అందులో భయంకరమైన చేదు వాస్తవాలు ఉన్నాయన్నారు.
అఫిడవిట్‌లో కంటే రూపాయి ఎక్కువున్నా తిరిగిచ్చేస్త
ఎన్నికల అఫిడవిట్‌లో తాను పేర్కొన్న దాని కన్నా తన వద్ద ఒక్క రూపాయి ఎక్కువున్నట్టు ఎవరు నిరూపించినా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తానని కవిత తెలిపారు. తన ఫామ్‌హౌస్ లీగల్‌గా కట్టుకున్నానని, అందులో కబ్జా ల్యాండ్‌గానీ, ఎఫ్టీఎల్ జోన్‌గానీ, అసైన్డ్ ల్యాండ్‌గానీ లేదన్నారు. ప్రతి పైసా తాను చట్టానికి లోబడి సంపాదించుకున్నదేనని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటానని స్పష్టం చేశారు. తన దగ్గరేమీ దొంగ భూమి లేదని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్ ఫామ్‌హౌస్‌లకు సంబంధించి వేసిన సిట్ ఉత్తదేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా అనేక రంగాల్లో వేసిన సిట్‌లతో ఏం ఒరిగిందని ప్రశ్నించారు. డైవర్షన్ స్కీమ్‌లో భాగంగానే సీఎం రేవంత్ ఇలాంటి సిట్‌లు వేస్తారని, చర్యలు మాత్రం ఉండవని అన్నారు. ఇంటర్నల్‌గా ఒప్పందాలు జరిగే వరకు ఇలాంటి టైమ్ పాస్ సిట్‌లు కొనసాగుతూనే ఉంటాయని ఆరోపించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.
